డెంగ్యూ నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డెంగ్యూ నివారణపై వర్చువల్ విధానంలో వారు సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ సహా అన్ని మున్సిపాలిటీల్లో ఫివర్ సర్వే నిర్వహించాలని సూచించారు.జీహెచ్ఎంసీ పరిధిలో ఇంటింటి ఫీవర్ సర్వేను వైద్యారోగ్య, జీహెచ్ఎంసీ సిబ్బంది కలిసి చేయాలని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో బూస్టర్ డోస్ విరివిగా వేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
‘‘ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ప్రతీ ఐదేళ్లకు ఒక సారి డెంగ్యూ కేసులు పెరుగుతుంటాయి. ఇది ఐదో సంవత్సరం కాబట్టి డెంగ్యూ కేసులు కొంచెం పెరుగుతున్న తీరు గమనిస్తున్నం. కాబట్టి వైద్యారోగ్య, పురపాలక, పంచాయతీ శాఖలు కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. జీహెచ్ఎంసీ పరిధిలో జులై నెలలో 542 డెంగ్యూ కేసులు ఉంటే ఆగష్టులో 1827 కేసులున్నాయి. డెంగ్యూకు కారణమైన మంచి నీటి దోమ పగటి పూటనే కుడతాయి. తొట్టిలో, కొబ్బరిచిప్పలు, పాత టైర్లు వంటి వాటిలో ఇవి పెరుగుతాయి. జీహెచ్ఎంసీలో 1600 మంది ఎంటమాలజీ స్టాఫ్ ఉన్నారు. వీరితో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది కలిసి ప్రతీ ఇంటికి వెళ్లి చైతన్యపర్చాలి. ప్రజా ప్రతినిధులు ప్రజలను భాగస్వామ్యం చేయించాలి. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, మందులు, ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉంది’’ అని హరీష్ రావు తెలిపారు.