పేదల సంక్షేమమే కాంగ్రెస్​ ధ్యేయం : ధనసరి సీతక్క

పేదల సంక్షేమమే కాంగ్రెస్​ ధ్యేయం : ధనసరి సీతక్క

వర్ధన్నపేట/ ఏటూరునాగారం, వెలుగు: పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్​ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని ఉమ్మడి జిల్లా మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క అన్నారు. ఆదివారం ప్రభుత్వం ప్రారంభించిన నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు వారు పత్రాలను అందజేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం వెంకటరావు పల్లె (బొక్కల గూడెం)లో ఎమ్మెలే నాగరాజు అధ్యక్షతను నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని కలెక్టర్​సత్యశారదతో కలిసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 30 మంది లబ్ధిదారులకు రూ.1,26,000, రేషన్ కార్డులు లబ్ధిదారులు 108, రైతు భరోసా 347 మందికి 851 ఎకరాలు రూ.51,05,224, ఇందిరమ్మ ఇండ్లు 91 మంది లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేశారు.

 ఇదే సమయంలో వృద్ధురాలు స్టేజి పైకి రావడానికి ఇబ్బంది పడుతుంటే, గమనించిన మంత్రి సురేఖ ఆ వృద్ధురాలికి చేయి అందించి పైకి పిలించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పత్రాలను ఇచ్చారు. మరో వృద్ధురాలు ఇందిరమ్మ ఇల్లు రావడంతో ఎమ్మెల్యే, మంత్రి కాళ్లు మొక్కబోతుంటే ఎమ్మెల్యే నాగరాజు ఆ వృద్ధురాలు కాలు మొక్కి పథకం పత్రాన్ని అందజేశారు. ములు జిల్లా వెంకటపూర్ మండలం లింగపూర్, ములుగు మండలం జీవంతరాపల్లి, గోవిందరావుపేట మండలం రాఘవపట్నం గ్రామాల్లో నాలుగు పథకాలను కలెక్టర్ దివాకర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ తో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సందేశంతో కూడిన వీడియో క్లిప్ ను ప్రదర్శించారు. జీవంతరావుపల్లిలో 995 మందికి రైతు భరోసా, 4 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 125 మందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడంతో పాటు 119  కొత్త రేషన్ కార్డులు, లింగపూర్​లో 70 మందికి రైతు భరోసా, 14 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 22 మందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడంతోపాటు 32  కొత్త రేషన్ కార్డులు పత్రాలను అందించారు.