- అన్నివర్గాలను కలుస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
- అసంతృప్తులను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు
- కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి హామీలు
మహబూబ్‌నగర్, వెలుగు : ఎలక్షన్ల టైం దగ్గర పడుతుండటంతో ఆత్మీయ సమ్మేళనాలు ఊపందుకుంటున్నాయి. రెండు నెలల కింద ఒక ట్రిప్ సమ్మేళనాలు కంప్లీట్ చేసిన రూలింగ్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు..వారికి టికెట్లు కన్ఫాం కావడంతో సెకండ్ ఫేజ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా వర్గాలకు కొత్త కొత్త హామీలు ఇస్తూ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
కుల సంఘాలపై ఫోకస్..
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను 115 స్థానాల్లో బీఆర్ఎస్ హైకమాండ్ గత మంగళవారం క్యాండిడేట్లను ఫైనల్ చేసింది. సిట్టింగులకే చాన్స్ రావడంతో, వారంతా ఇప్పుడు ప్రచారంపైనే ఫోకస్ పెట్టారు. ఈ ఎలక్షన్లో ప్రతి ఓటు కీలకం కావడంతో అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిని కలుపుకుపోయే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ప్రతి వర్గానికి చెందిన ఓటర్లకు దగ్గరయ్యేందుకు ఆత్మీయ సమ్మేళనాలకు ప్లాన్ చేశారు. ప్రతి రోజూ ఏదో ఒక వర్గంతో ఇంటరాక్ట్ అయ్యేటట్లు షెడ్యూల్ పెట్టుకుంటున్నారు. వడ్డెరులు, యాదవులు, పద్మశాలీలు, ఆర్యవైశ్యులు, బ్రహ్మణ, నాయిబ్రాహ్మణులు, ముదిరాజ్‌లు, బలిజ, గౌడ, మైనార్టీ తదితర వర్గాలను కలుస్తున్నారు.
ఇందుకోసం సమ్మేళనాల్లో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మేళనాలకు ముందు ఆయా వర్గాలతో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పటాకులు కాల్చి ప్రత్యేక వాహనాల్లో సభకు వరకు ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు హాల్లోకి ఎంట్రీ కాగానే గజమాలలతో సత్కారాలు, పెద్ద ఎత్తున పూల వర్షం కురిపిస్తున్నారు. అనంతరం ఎనిమిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా వర్గాల కోసం చేసిన కృషిని వివరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమకే ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అనంతరం ఈ వర్గాలకు చెందిన పెద్ద మనుషులతో చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల్లో తమకే సపోర్ట్ చేయాలని హామీ తీసుకుంటున్నారు.
తమను తిరిగి గెలిపిస్తే కమ్యూనిటీ హాళ్లు లేని చోట్ల కొత్త వాటి నిర్మిస్తామని హామీ ఇస్తున్నారు. వెంటనే భూమి కేటాయింపు చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటిని యుద్ధప్రాతిపదిన పూర్తి చేయించి, రిబ్బన్ కట్ చేస్తున్నారు. వీరితో పాటు వివిధ శాఖల ఉద్యోగులు, డీఆర్డీఏ, సెర్ప్, మెప్మా సిబ్బంది, రిటైర్డ్ ఎంప్లాయిస్, కుల సంఘాల వారీగా ఉద్యోగులతో ములాఖత్ అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అంకితభావంతో పని చేస్తోందని, ఇచ్చిన హామీల ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిందని గుర్తు చేస్తున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లలో పని చేస్తున్న వారికి జీతాలు కూడా పెంచిన విషయాన్ని సమ్మేళనాల్లో ప్రస్తావిస్తున్నారు. తమను తిరిగి గెలిపిస్తే, ఫ్యూచర్లో ఉద్యోగులకు మరింత మేలు జరిగేలా చూస్తామని హామీ ఇస్తున్నారు.
స్పెషల్ అట్రాక్షన్‌గా
ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రజలను అట్రాక్ట్ చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కుటుంబసభ్యులతో కలిసి హాజరవుతున్నారు. భార్యలతో వచ్చి సర్ప్రైజ్ చేస్తున్నారు. వారితో మైక్ పట్టించి మాట్లాడిస్తున్నారు. భోజనాలు ప్రారంభమయ్యాక వీరే స్వయంగా డైనింగ్ టేబుళ్ల వద్దకు వెళ్లి పబ్లిక్కు దగ్గరుండి వడ్డిస్తున్నారు. ఒక్కొక్కరిని పలుకురిస్తున్నారు. పనిలో పనిగా వారి కుటుంబాల యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు.