- పేదలకు మంచి చేసే విషయంలో రాజకీయాలొద్దు
- సియోల్ పరిస్థితి హైదరాబాద్ తరహానే ఉండేది
- ఇప్పుడు స్మార్ట్ సిటీ, స్పోర్ట్స్ సిటీ నిర్మించుకున్నారు
- ఒకటి రెండు రోజుల్లో కేబినెట్ కు సమగ్ర నివేదిక ఇస్తం
- విమానాశ్రయంలో మంత్రులు పొంగులేటి, పొన్నం
హైదరాబాద్: మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామని, పేదలకు మంచి చేసే విషయంలో ఎలాంటి రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సియోల్ పర్యటనకు వెళ్లిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి ఇవాళ నగరానికి చేరుకున్నారు. వారికి అభిమానులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఒకప్పుడు సియోల్ హైదరాబాద్ లాగే ఉండేదని, అక్కడి భౌగోళిక పరిస్థితులు, జనాభా, మురికి నీటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేదని అన్నారు.
ALSO READ | మూడు బ్యారేజీల్లో 2019 నుంచే సమస్యలు
ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లడంతో అద్భుతమైన ప్రగతిని సాధించారని వివరించారు. ప్రస్తుతం సియోల్ సమీపంలో స్మార్ట్ సిటీ, స్పోర్ట్స్ సిటీ నిర్మితమయ్యాయని అన్నారు. మూసీ మురికి కుంపటిలో దుర్భరమైన జీవితం అనుభవిస్తున్న వారికి మంచి జీవితం ఇవ్వాలన్న తలంపుతోనే సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టులో సియోల్ వెళ్లి అక్కడి జీవన స్థితిగతులను చూసి వచ్చారని చెప్పారు. సమగ్ర అధ్యయనం కోసం తమను పంపారని అన్నారు. తాము పరిశీలించిన అంశాలపై ఒకటి రెండు రోజుల్లో క్యాబినెట్ కు సమగ్ర నివేదిక ఇస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మూసీ రివర్ బెడ్ లో నివసించే ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం అండగా ఉంటుందని పొంగులేటి చెప్పారు.