- వాళ్లలాగ రాళ్లు, రప్పలకు ఇవ్వం: మంత్రి పొంగులేటి
- రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినా.. వారికంటే ఎక్కువే ఇస్తున్నం
- వచ్చే ఐదేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం
- ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తున్నామని వెల్లడి
- వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
వరంగల్, వెలుగు : మాజీ సీఎం కేసీఆర్ అడిగితే.. రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి అన్నారు. 200 ఎకరాలలో పంట వేసినా.. తన దగ్గర డబ్బు లేదని, ఉన్న డబ్బు సరిపోదని.. సాయం కావాలని అడిగితే కేంద్ర ప్రభుత్వం మాదిరిగా ఎటువంటి కండీషన్స్ పెట్టకుండా రైతుభరోసా ఇస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసిపోయినా.. వాళ్లిచ్చిన రూ.10 వేల కంటే ఎక్కువగా ఎకరానికి రూ.12 వేలు రైతుభరోసా ఇస్తున్నట్టు తెలిపారు. వారిలెక్క కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, చెరువులు, రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వకుండా.. వ్యవసాయానికి యోగ్యమైన ప్రతీ ఎకరానికి రైతుభరోసా ఇస్తామని చెప్పారు.
అలాగే, భూమిలేని అర్హులైన నిరు పేదలకు ఏటా రూ.12 వేలు ఇస్తామన్నారు. సోమవారం ఆయన వరంగల్లో పర్యటించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డితో కలిసి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. అనంతరం జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతిపై హనుమకొండ కలెక్టరేట్‍లో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్‍ఎస్ ప్రభుత్వం పదేండ్లలో లక్ష ఇండ్లు కట్టినా.. అందులో 35 వేల వరకు పంపిణీ చేయలేదన్నారు. వాటిలో కిటికీలు, దర్వాజలు ఎత్తుకెళ్లారని.. అవి మొండిగోడలతో ఉన్నాయన్నారు.
2004, 2014 మధ్యలో కాంగ్రెస్ 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించిందని, వచ్చే ఐదేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. ఇండ్ల కోసం 80 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకోగా, ఇప్పటికే 64 లక్షల మంది వివరాలు సేకరించినట్టు చెప్పారు. నాడు అప్లికేషన్ పెట్టుకోనోళ్లు ఇప్పుడు మండల ఆఫీసులో పెట్టుకోవాలన్నారు. డబుల్ బెడ్‍రూం ఇండ్లు మంజూరై నిర్మాణం పూర్తి కానివారికి రూ.5 లక్షల్లో మిగతా డబ్బులు చెల్లిస్తామన్నారు. కేసీఆర్ హయాంలో కొత్తగా లక్ష కార్డులిచ్చి.. లక్ష వరకు పాత కార్డులు తీసేశారన్నారు. బై ఎలక్షన్లు ఉన్నచోట 18 వేల రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చారన్నారు. కేసీఆర్ సర్కారు ఆర్టీసీని దండగగా మారిస్తే.. తాము ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు.
అసెంబ్లీకి రావడానికి కేసీఆర్కు ఏమైంది?
అప్పట్లో తొంటివిరిగి అసెంబ్లీకి కేసీఆర్ రాలేదని, ఇప్పుడు రావడానికి ఏమైందని మంత్రి పొంగులేటి నిలదీశారు. అసెంబ్లీకి వచ్చి మంచి సూచనలు ఇవ్వాలని కేసీఆర్ను అడిగామని.. అతను రాకుండా అంబోతుల్లాంటివారిని పంపారని అన్నారు. వారు సభ జరగకుండా పుస్తకాలు చింపి.. బల్లలు విరగ్గొట్టారని.. బల్లల మీదికెక్కి డాన్సులు చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అచ్చోసిన అంబోతుల్లా దళిత స్పీకర్‍తో పాటు తనపై రౌడీల్లా దౌర్జన్యం చేశారన్నారు.
రెండు ఎన్నికల్లో ప్రజలు బీఆర్‍ఎస్ కు కర్రుకాల్చి వాత పెట్టారని, రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ వాళ్లకొచ్చేది పెద్ద గుండు సున్నానేనని, బీఆర్ఎస్డోర్లు క్లోజ్ అవుతాయని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 125 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణం చేశారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట్రానికి 1000 ఎలక్ట్రిక్ బస్సులు వస్తే.. అందులో 500 హైదరాబాద్ మరో 500 ఇతర జిల్లాలకు కేటాయించినట్టు పేర్కొన్నారు. తాము బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే కేటీఆర్ ఆటోవాళ్లను రెచ్చగొడుతున్నాడని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు.