- ఫైనాన్షియల్ అంశాలు కేబినెట్ సబ్ కమిటీలో చర్చిస్తామని హామీ
హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సమగ్ర శిక్ష ఉద్యోగులు తక్షణమే సమ్మె విరమించాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క కోరారు. సమ్మెతో కేజీబీవీల్లో చదువుతున్న బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు నష్టపోతున్నారని, వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దని వారు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నేతలతో సోమవారం మంత్రులు చర్చలు జరిపారు. సమగ్రశిక్షలో, కేజీబీవీల్లో ఏండ్ల నుంచి పనిచేస్తున్నామని, తమను రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగులు కోరారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష స్కీమ్ కేంద్రం పరిధిలో 60 శాతం, రాష్ట్రం పరిధిలో 40 శాతం ఉంటుందని తెలిపారు. ఈ అంశాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకుపోయినట్టు చెప్పారు. సర్వశిక్ష ఉద్యోగుల సమస్య దేశవ్యాప్తంగా ఉందని, సీఎం దృష్టికి తీసుకుపోయి కేంద్రానికి ప్రతిపాదనలు పెడతామమన్నారు. 25 రోజులుగా కేజీబీవీ టీచర్లు సమ్మె చేయడంతో పిల్లలకు విద్యాబోధన జరగక తీవ్రంగా నష్టపోతున్నదని, తక్షణమే సమ్మె విరమించి ఉద్యోగులు విధుల్లో చేరాలని కోరారు.
సమ్మె విరమిస్తే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీతో సమావేశానికి పిలుస్తామని హామీ ఇచ్చారు. సబ్ కమిటీలో సమస్యలపై చర్చిస్తామని పేర్కొన్నారు. నాన్ ఫైనాన్సియల్ డిమాండ్స్ లో మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్స్, సీఎల్ లు తదితర వాటిపై చర్చించి.. సాధ్యమైనంత వరకు పరిష్కరించేలా ప్రభుత్వం చూస్తుందన్నారు.
ఆర్థికపరమైన డిమాండ్స్ పై సబ్ కమిటీలో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, ఉద్యోగుల సంఘం నేతలు యాదగిరి, సురేందర్, శ్రీధర్ పాల్గొన్నారు.