
- హాజరుకానున్న నలుగురు మంత్రులు
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్‌లో టెక్స్‌పోర్ట్ యూనిట్‌ను రాష్ట్ర మంత్రులు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వెల్లడించారు. ఈ సందర్భంగా అపెరల్ పార్క్‌ను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ నెల 11న జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఆయా శాఖల మంత్రులు పార్కులోనే టెక్స్ పోర్ట్ యూనిట్‌ను ప్రారంభిస్తారని వెల్లడించారు. మంత్రుల రాక సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఆయన వెంట సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల డిప్యూటీ తహసీల్దార్ విజయ్ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆఫీసర్లు రైతులకు అందుబాటులో ఉండాలి
జిల్లాలోని ఏవోలు, ఏఈవోలు రైతులకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై ఆఫీసర్లతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ పంట కోతలు పూర్తయిన రైతులకు టోకెన్లు అందజేయాలన్నారు. జిల్లాలోని వ్యవసాయ అధికారులు రైతులకు తమ పరిధిలోని రైతు వేదికలు, ఆఫీసుల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. డీఏవో అఫ్జల్ బేగం, లీడ్ బ్యాంకు మేనేజర్ మల్లికార్జునరావు, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.