- ప్రభుత్వానికి వచ్చే ప్రజాదరణ తట్టుకోలేకే ప్రతిపక్షాల ఆరోపణలు
- ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రులు తుమ్మల, పొంగులేటి
ఇల్లెందు, వెలుగు : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం.. ప్రజల మెప్పు పొందుతామని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం ఇల్లెందు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ ఇల్లెందు పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియల్ అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రులు మాట్లాడారు. రేషన్, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను పొందేందుకు ఒకే స్మార్ట్ కార్డును తీసుకువస్తున్నామని తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలో రూ.150 కోట్లతో 22 ఎకరాల విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ విద్యాలయాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికీ 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, ఇల్లెందు, పినపాక, భద్రాచలం, కారేపల్లి నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వుడ్ స్థానాలని, ఇక్కడ వెసులుబాటును బట్టి 15 వేల ఇండ్ల వరకు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ప్రజాదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని, ఇంకా రూ.13వేల కోట్లు రెండు నెలల్లో రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. అధిక వర్షాలతో పత్తి దిగుబడులు తగ్గినందున గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తామన్నారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టిసారించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ నాయక్, కార్పొరేషన్ చైర్మన్ గోపాల్ రెడ్డి, మువ్వ విజయబాబు, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలస్వామి లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు
ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి
ఖమ్మం టౌన్ : ఉద్యోగులు సహకరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రులు తుమ్మల, పొంగులేటి అన్నారు. గొల్లగూడెం రోడ్డులోని చెరుకూరి వారి మామిడి తోటలో తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్లు, కార్మికులు, పెన్షనర్స్ (టీజీఈజేఏసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ముఖ్యమంత్రి ధైర్యం చేసి ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో 204 ఉద్యోగ సంఘాలు ఏకధాటిగా పోరాటం చేశాయని, వీరి పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తు చేశారు. కాగా ఉద్యోగుల ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస రావు, చైర్మన్ మారం జగదీశ్వర్ కలిసి మంత్రులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న అన్నం శ్రీనివాస రావును, వనజీవి రామయ్యను, సీనియర్ సిటిజన్ రిటైర్డ్ ఉద్యోగులను ఉద్యోగ సంఘాల తరఫున సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ ఏ. నర్సిరెడ్డి, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్, ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, టీజీవో జిల్లా అధ్యక్షుడు కస్తాల సత్య నారాయణ, టీజీవో జిల్లా ప్రధాన కార్యదర్శి మోదుగు వేదాద్రి, టీజీహెచ్ డబ్ల్యూవో జిల్లా అధ్యక్షుడు కోటిపాక రుక్మారావు, దేవరకొండ సైదులు, నాగిరెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.