- అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తం: మంత్రి ఉత్తమ్
- విడతలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
- ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది: మంత్రి పొన్నం
- కరీంనగర్ జిల్లాలో పలు గ్రామ సభలకు హాజరైన మంత్రులు
కరీంనగర్, వెలుగు: అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ పథకాలు అందుతాయని.. గ్రామసభల్లో ప్రకటించిన జాబితాలో పేర్లు లేకుంటే.. అదే సభలో మళ్లీ అప్లై చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు సూచించారు. గతంలో మీసేవ, ప్రజావాణి, సర్వేలలో సమర్పించిన దరఖాస్తులన్నీ పరిశీలిస్తామని, అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట, గంగాధర మండలం నారాయణాపూర్, రుద్రంగి మండల కేంద్రంలో, ధర్మపురి మండలం జైన గ్రామంలో నిర్వహించిన గ్రామసభలకు మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఉత్తమ్హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. పెండ్లి అయిన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. కార్డులలో కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులు కూడా పూర్తి చేస్తామన్నారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ముగిశాక ప్రతి వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. అర్హత ఉన్న వాళ్లందరికీ విడతలవారీగా ఇందిరమ్మ ఇండ్లు కట్టించే ప్రక్రియ చేపట్టామన్నారు. సాగు చేసేందుకు యోగ్యంగా ఉన్న ప్రతి ఎకరానికి సంవత్సరానికి రూ.12 వేల రైతు భరోసా ఇవ్వబోతున్నట్టు చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు అందజేస్తున్నామన్నారు.
ప్రతిపక్ష నేతలు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు..
రాష్ట్రంలో అర్హులైన ఎంతో మందికి గత పదేండ్లుగా రేషన్ కార్డులు రాని పరిస్థితి నెలకొందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందన్నారు. ప్రతిపక్ష నేతలు సూచనలు, సలహాలు చేయకుండా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.
ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝా తదితరులు పాల్గొన్నారు.