గోదావరి ప్రొటెక్షన్  వాల్​కు రీ డిజైన్!

గోదావరి ప్రొటెక్షన్  వాల్​కు రీ డిజైన్!
  • మంగపేట తీరం వద్ద రక్షణ చర్యలపై మంత్రులు ఉత్తమ్, సీతక్క రివ్యూ
  • ఫ్లడ్​ బ్యాంక్స్​ నిర్మాణానికి గతంలో రూ.250 కోట్లతో ప్రతిపాదనలు
  • అంత ఎందుకవుతుందని ప్రశ్నించిన మంత్రి ఉత్తమ్​
  • రివ్యూ చేయాలని ఆదిత్యనాథ్​ దాస్​కు బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: గోదావరి వరద పోటుతో కోతకు గురవుతున్న మంగపేట తీరాన్ని పటిష్టం చేసేందుకు చేపట్టనున్న రక్షణ పనులకు రీ డిజైన్​ చేయాలని అధికారులకు ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. రీ డిజైన్​ల పర్యవేక్షణ బాధ్యతలను నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్​ దాస్​కు అప్పగించారు. వరంగల్​ జిల్లా మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో ఏటా వరదలప్పుడు తీరం కోతకు గురై పంట పొలాలు మునిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ గట్టు రక్షణ చర్యలపై మంగళవారం జలసౌధలో మంత్రులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, సీతక్క సమావేశమయ్యారు.

గోదావరి రివెట్మెంట్​ (ఫ్లడ్​ బ్యాంక్స్​)తో పాటు ఇతర పనులపై చర్చించారు. గట్టు కోతకు గురికాకుండా ప్రొటెక్షన్​ వాల్స్​ లేదా ఫ్లడ్​ బ్యాంక్స్​ను నిర్మించేలా చూడాలని మంత్రి సీతక్క కోరారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఉత్తమ్​ ఆదేశించారు. అయితే, ఇప్పటికే ఆ పనులకు సంబంధించి రూ.250 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని ములుగు ఇంజనీరింగ్​ అధికారులు మంత్రికి వివరించారు. దానికి అంత మొత్తం ఎలా అవుతుందని మంత్రి ప్రశ్నించినట్టు తెలిసింది. సెంట్రల్​ డిజైన్స్​ ఆర్గనైజేషన్​ (సీడీవో) సీఈని పిలిచి డిజైన్ల వివరాలను ఆరా తీశారని సమాచారం.

మరోసారి డిజైన్లను తయారు చేసి పంపాలని సీడీవో సీఈని ఆదేశించారని తెలిసింది. కాగా, రామప్ప–లక్నవరం మధ్య పది కిలోమీటర్ల వరద కాల్వ కింద పోతున్న భూములకు పరిహారాన్ని పెంచే అంశంపై చర్చించినట్టు సమాచారం. రామప్ప చెరువు 30 అడుగుల స్థాయికి చేరుకోగానే దాని కింద ఉన్న పొలాలు మునిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే భూములు నష్టపోతున్న రైతులకు ఇచ్చే పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే అంశంపై చర్చించినట్టు తెలిసింది. పొట్లప్లల్లి లిఫ్ట్​ స్కీమ్​పైనా చర్చించినట్టు సమాచారం.