- కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు
న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే నెలలో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ అబ్జర్వర్లు, స్టేట్ ఎలక్షన్ సీనియర్ కో-ఆర్డినేటర్లను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఇందులో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కకు చోటు కల్పించింది. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు రిలీజ్ చేశారు.
పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేతలకు మహారాష్ట్ర, జార్ఖండ్ ఏఐసీసీ అబ్జర్వర్లుగా బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్‌గా భట్టి విక్రమార్కను అధిష్టానం నియమించింది. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేతలు తారిఖ్ అన్వర్, అధీర్ రంజన్ చౌధరీలకు బాధ్యతలు అప్పగించింది.
అలాగే, మహారాష్ట్రలో మొత్తం ఐదు డివిజన్లు ఉండగా.. మరాఠ్వాడకు సచిన్ ఫైలెట్‌తో పాటు కలిపి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నార్త్ మహారాష్ట్ర డివిజన్ బాధ్యతను సయ్యద్ నసీర్ హుస్సేన్‌తో పాటు కలిపి మంత్రి సీతక్కకు అప్పగించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.