మహారాష్ట్ర , జార్ఖండ్ ఎన్నికల వ్యూహాల్లో.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బిజీ.. బిజీ

మహారాష్ట్ర , జార్ఖండ్ ఎన్నికల వ్యూహాల్లో.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బిజీ.. బిజీ
  • మహారాష్ట్ర నేతలతో ఉత్తమ్, సీతక్క భేటీలు 
  • జార్ఖండ్ లో మొదటి విడత చర్చలు ముగించిన భట్టి
  • వచ్చే నెల మొదటి వారంలో సీఎం, పీసీసీ చీఫ్​ల ప్రచారం

హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయా రాష్ట్రాల పార్టీ నాయకులతో సమావేశమై వ్యూహాలు రూపొందిస్తున్నారు. మహారాష్ట్రలోని మరఠ్వాడ ప్రాంతానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నార్త్ మహారాష్ట్రకు మరో మంత్రి సీతక్క పార్టీ ఇన్​చార్జ్​లుగా నియమితులయ్యారు. ఇక జార్ఖండ్ రాష్ట్రానికి కాంగ్రెస్ సీనియర్ అబ్జర్వర్ గా డిప్యూటీ సీఎం భట్టి నియమితులయ్యారు. ఈ నేతలు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో మొదటి విడత ప్రచార వ్యూహాలపై అక్కడి నేతలతో చర్చించారు.

ఆదివారం ముంబైలో అక్కడి పార్టీ నేతలతో ఉత్తమ్, సీత్కక్క సమావేశమై మహారాష్ట్రలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎలాంటి వ్యూహాలను రచించాలనే దానిపై చర్చించారు. ఈ భేటీలో ఉత్తమ్, సీతక్కతో పాటు మాజీ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్, చరణ్ జిత్ చన్నీ ఇతర నేతలు సమావేశమయ్యారు.

ఇక గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులు జార్ఖండ్ రాజధాని రాంచీలో మకాం వేసిన డిప్యూటీ సీఎం భట్టి అక్కడి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆదివారం రాహుల్ ఆ రాష్ట్ర పర్యటన సందర్భంలో కూడా పార్టీ సీనియర్ అబ్జర్వర్ గా భట్టి ఆయన వెన్నంటే ఉంటూ అక్కడి నేతలకు దిశానిర్దేశం చేశారు.

తెలుగు ప్రజలున్న సెగ్మెంట్లలో ప్రచారం

ఇక వచ్చే నెల మొదటి వారంలో ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారానికి సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలుగు వారు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు షెడ్యూల్ ను ఖరారు చేసే పనిలో ఉన్నారు. దీనిపై ఇప్పటికే హైకమాండ్ నుంచి ఈ ఇద్దరు నేతలకు ఆదేశాలు అందాయి.

వీరే కాకుండా రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తెలుగు వారు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి.. ఇద్దరు ఇప్పటికే మహారాష్ట్రలో తమకు కేటాయించిన జిల్లాల్లో మొదటి విడతగా అక్కడి పార్టీ నేతలతో సమావేశమై ప్రచార వ్యూహాలపై చర్చించారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ లీడర్లతో పాటు పార్టీ క్యాడర్ కూడా ఈ రెండు రాష్ట్రాల్లో ప్రచారం చేసేందుకు తరలి వెళ్లనుంది.