- వరంగల్ సిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు
వరంగల్, ఖిలా వరంగల్(కరీమాబాద్), వెలుగు: హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తున్నామని రెవెన్యూ శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వరంగల్ఓసిటీ మైదానంలో ఆయన జెండావిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తునందుకు గర్వపడుతున్నానని చెప్పారు.
చారిత్రాత్మక వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాదించిందని తెలిపారు. వరంగల్ పాత బస్ స్టేషన్ స్థానంలో అధునాతన సౌకర్యాలతో కొత్త బస్టాండ్ ను పూర్తి చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే కాళోజీ కళాక్షేత్రం పనులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేశామని, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్కు పనులు అన్ని హంగులతో త్వరలో పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్య శారద, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, విద్యుత్ ఎస్ఈ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, వరంగల్ లోని కాకతీయ, ఏకశిలా జర్నలిస్ట్ హౌసింగ్ కోపరేటీవ్ సొసైటీలకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లో కేటాయించిన స్థలాలకు డబ్బు చెల్లించేందుకు అనుమతి ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కాకతీయ జర్నలిస్ట్ హౌసింగ్ కోపరేటీవ్ సొసైటీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మంత్రి పొంగులేటితో ప్రత్యేకంగా కలిసి రెండు సొసైటీల స్థలాల విషయాన్ని ప్రస్తావించారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించారు.
అభివృద్ధి పనులు ప్రారంభం
కాశీబుగ్గ (కార్పొరేషన్)/ వరంగల్‌సిటీ : వరంగల్ బస్ స్టాండ్ సమీపంలో ఎస్ఎన్ఎం జంక్షన్లో రూ.60 లక్షలతో జంక్షన్లలో అభివృద్ధి పనులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ప్రభుత్వ ఎంజీఎం ఆస్పత్రిలో రూ.41 లక్షలతో ఏర్పాటుచేసిన సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ కౌంట్ మెషిన్ ను ప్రారంభించారు. అనంతరం వారు ఆస్పత్రిలోని పలు విభాగాలను కలియతిరుగుతూ రోగులతో మాట్లాడారు. వంటశాలను సందర్శించి, భోజనాన్ని పరిశీలించారు. అనంతరం కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని పీఎంఎస్ఎస్ వై ఆస్పత్రిలో 14 పడకలకతో ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు.
అదనంగా 10 డయాలసిస్ పడకలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. మెడికల్ కళాశాలలో రూ.3 కోట్ల 45 లక్షలతో నిర్మించే అంతర్గత రోడ్ల పనులను మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, బల్దియా మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్న పేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్కలెక్టర్ సత్య శారద, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, కార్పొరేటర్లు చింతాకుల అనిల్ కుమార్, కావేటి కవిత, ఉమా దామోదర్ యాదవ్, ఓని స్వర్ణలత భాస్కర్, ప్రవీణ్, ముష్కమల్ల అరుణ సుధాకర్, గుండు చందన పూర్ణ చందర్, పోశాల పద్మ స్వామి గౌడ్, భోగి సువర్ణ సురేశ్, బల్దియా ఎస్ఈ ప్రవీణ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.