
- ప్రతిపాదనలు ఇవ్వాలని ఎన్హెచ్ఏఐ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
ఖమ్మం, వెలుగు : ఖమ్మం-–విజయవాడ, నాగపూర్-–అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేకు ఇరువైపులా జిల్లా సరిహద్దుల వరకు సర్వీసు రోడ్లు ఏర్పాటు చేసేందుకు అసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధిపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులతో గురువారం తన క్యాంప్ ఆఫీసులో రివ్యూ నిర్వహించారు. నేషనల్ హైవేల నిర్మాణాలు సాగుతున్నందున రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా జిల్లా సరిహద్దుల వరకు సర్వీసు రోడ్డు నిర్మించే విధంగా సమగ్ర నివేదిక వెంటనే సిద్ధం చేసి అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి సమర్పిస్తామన్నారు.
అదేవిధంగా ధంసలాపురం, బోనకల్ రోడ్డు దగ్గర ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్లు, సర్వీస్ రోడ్లు కోసం ప్రాజెక్టు డైరెక్టర్ నుంచి అనుమతి వచ్చిందని, వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ నెల 15న వైరా నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నందున ఖమ్మం,-అశ్వారావుపేట రహదారిపై ఏర్పడిన గుంతలు పూడ్చాలని సూచించారు. వైరా బ్రిడ్జిపై అవసరమైన రిపేర్లు చేపట్టాలన్నారు.
సీఎం సభా స్థలాన్ని పరిశీలన
వైరా, వెలుగు : కృష్ణా, గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కానుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈనెల 15న వైరాలో జరగనున్న రైతు సదస్సు సభా స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 15న సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ లను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభిస్తారని చెప్పారు.
వైరాలో జరిగే రైతు సదస్సు సభా వేదికపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతాంగ సంక్షేమ పథకాలపై రుణమాఫీ సంబరాలు జరపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంత్రి వెంట ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సీపీ సునీల్ దత్, వైరా ఏసీపీ రహమాన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రెవెన్యూ ఆఫీసర్లు ఉన్నారు.