కెనడా చెబుతున్నది అబద్ధం..దౌత్యవేత్తలను మేమే వెనక్కి తీసుకున్నం: భారత్

కెనడా చెబుతున్నది అబద్ధం..దౌత్యవేత్తలను మేమే వెనక్కి తీసుకున్నం: భారత్
  • కెనడా బహిష్కరించలేదు: భారత్
  • నేరస్తులను అప్పగించాలని 26 సార్లు విజ్ఞప్తి చేశామని వెల్లడి

న్యూఢిల్లీ: భారతీయ దౌత్యవేత్తలను తామే ఉపసంహరించుకున్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇండియన్ డిప్లొమాట్లను బహిష్కరించామని కెనడా చేసిన వ్యాఖ్యలు అబద్ధమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్​ధీర్ జైస్వాల్ తెలిపారు. గురువారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. అలాగే, కెనడాలో ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్​ను భారత ప్రభుత్వం వాడుకుంటోందన్న ఆరోపణలను కూడా జైస్వాల్  కొట్టివేశారు. 

‘‘బిష్ణోయ్ గ్యాంగ్ తో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా పోలీసులు చేసిన వ్యాఖ్యలు అర్థరహితం. వాస్తవానికి బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులతో సహా కెనడాలో ఉంటున్న నేరస్తులను అప్పగించాలని 26 సార్లు ఆ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. గత పదేళ్లుగా మేము చేస్తున్న ఆ వినతులు కెనడా వద్ద ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. బిష్ణోయ్  గ్యాంగ్  సభ్యుల గుర్తింపును కూడా ఇచ్చాం. 

కానీ, నేరస్తులను భారత్ కు అప్పగించకుండా కెనడా పోలీసులు మన మీదే నింద మోపుతున్నారు” అని జైస్వాల్ పేర్కొన్నారు. నిజ్జర్  హత్య కేసులో భారత ప్రభుత్వ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్  ట్రూడో చేసిన ఆరోపణలు సైతం అర్థరహితం. నిరుడు సెప్టెంబరు నుంచి భారత్​పై ట్రూడో ఆరోపణలు చేశారని, సాక్ష్యాధారాలు అడిగితే.. ఇంతవరకు ఇవ్వలేదని జైస్వాల్ వెల్లడించారు. భారత్​పై కావాలనే బురద జల్లేందుకు కెనడా ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని ఆయన మండిపడ్డారు.

స్వయంగా ట్రూడోనే ఒప్పుకున్నడు..

ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్  నిజ్జర్  హత్య కేసులో భారత ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్  ట్రూడో  సెల్ఫ్  గోల్  చేసుకున్నారు. నిజ్జర్  హత్య కేసులో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందనేందుకు గట్టి ఆధారాలేవీ లేవని బుధవారం మీడియాతో వెల్లడించారు. ‘‘నిజ్జర్  హత్య కేసులో నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు చూపాలని భారత ప్రభుత్వం అడిగింది. 

అయితే, మా దేశ ఇంటెలిజెన్స్  సమాచారం ఆధారంగా మాత్రమే నేను ఆ ఆరోపణలు చేశాను. నిజ్జర్  హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది” అని ట్రూడో  తెలిపారు. కాగా.. నిజ్జర్  హత్య కేసులో ట్రూడో చేసిన ఆరోపణలపై కెనడా మీడియా మండిపడింది. సాక్ష్యాధారాలు లేకుండా ఎలా ఆరోపణలు చేస్తారని నిలదీసింది.