చాట్ జీపీటీ, డీప్‌సీక్​నువాడొద్దు! కేంద్ర ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు

చాట్ జీపీటీ, డీప్‌సీక్​నువాడొద్దు! కేంద్ర ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు
  • డేటా, డాక్యుమెంట్లకు భద్రత, ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదముందని వెల్లడి
  • ఉద్యోగులకు  ఆర్థిక శాఖ ఆదేశాలు 

న్యూఢిల్లీ: భారత ఆర్థిక శాఖ పరిధిలోని ఉద్యోగులు.. అధికారిక పనుల కోసం చాట్​జీపీటీ, డీప్‌‌సీక్ ​వంటి ఏఐ టూల్స్​ఉపయోగించొద్దని ఆ శాఖ సూచించింది. గవర్నమెంట్​డాక్యుమెంట్స్, డేటా గోప్యతకు ఎదురయ్యే ప్రమాదాలను ఉదహరిస్తూ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. డేటా భద్రతా ప్రమాదాలను పేర్కొంటూ ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు డీప్‌‌సీక్ వాడకంపై ఆంక్షలు విధించాయి. 

ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఇతర పరికరాల్లో వాడుతున్న ఏఐ యాప్‌‌లు డేటా భద్రతకు, గోప్యతకు భంగం కలిగించవచ్చనే భయాందోళనే అందుకు ప్రధాన కారణం. ఓపెన్‌‌ ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్మాన్ భారతదేశ పర్యటన సందర్భంగా మంగళవారం సోషల్ మీడియాలో ఈ నివేదికలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన ఐటీ మంత్రిని కలవనున్నారు. "కార్యాలయ కంప్యూటర్లు, పరికరాల్లోని ఏఐ టూల్స్, ఏఐ యాప్‌‌లు ప్రభుత్వ డేటా, పత్రాల గోప్యతకు ముప్పు కలిగిస్తాయని నిర్ధారణ అయిందని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ జనవరి 29న జారీ చేసిన రిపోర్ట్​లో పేర్కొంది. 

దీనిపై చాట్​జీపీటీ -పేరెంట్ ఓపెన్​ఏఐ, డీప్‌‌సీక్ ప్రతినిధుల స్పందన కోసం భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ సంప్రదించగా.. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే, ఆ నోట్ నిజమైనదని, ఈ వారం అంతర్గతంగా జారీ చేయబడిందని ముగ్గురు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. కాగా, దేశంలోని ఇతర మంత్రిత్వ శాఖల ఉద్యోగులకు కూడా ఇలాంటి ఆదేశాలు జారీ చేశారా? లేదా అనేది తెలియలేదు. దేశంలో ఓపెన్ ఏఐ చట్టపరమైన సవాళ్లు ఎదుర్కొంటోంది.