ఆర్థిక వృద్ధిలో తెలంగాణ టాప్.. పెట్టుబడుల ఆకర్షణతోనూ పెరుగుతున్న జీఎస్‌‌‌‌డీపీ

  • 2024–25లో జీఎస్‌‌‌‌డీపీ 9.2% నమోదు.. జాతీయ జీడీపీ 8.2% 
  • మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ నివేదికలో వెల్లడి 
  • రాష్ట్ర సర్కార్ చర్యలతో గ్రామీణ, వ్యవసాయ రంగాలకు ఊతం 
  • పెట్టుబడుల ఆకర్షణతోనూ పెరుగుతున్న జీఎస్‌‌‌‌డీపీ
  • తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం ముందంజ  

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు గణనీయ ప్రగతిని కనబరుస్తోంది. అప్పుల వివరాలను బయట పెడుతూ రాష్ట్రం పరువు తీస్తున్నారని ప్రతిపక్షాలు చేసిన విమర్శలను తిప్పికొట్టేలా ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతోంది. జీఎస్‌‌‌‌డీపీలో జాతీయ స్థాయిని మించి తెలంగాణ దేశంలోనే టాప్ ప్లేస్​లో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం రాష్ట్రం 2024–25 ఆర్థిక సంవత్సరంలో 9.2 వృద్ధి రేటును సాధించనుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్​ ఇంప్లిమెంటేషన్ ఈ నెల ఒకటో తేదీన ఈ మేరకు అంచనాల నివేదికను విడుదల చేసింది.

దీని ప్రకారం జాతీయ వృద్ధి రేటు 8.2 శాతం ఉండగా.. తెలంగాణ 9.2 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. వాస్తవానికి 2023–24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర వృద్ధిరేటు 0.2 శాతం తక్కువగా నమోదైంది. కానీ 2024–25 అంచనాల్లో ఈ ఐదు నెలల కాలంలోనే జాతీయ వృద్ధి రేటును దాటి.. ఒక శాతం ఎక్కువగా నమోదు చేసింది.  గతేడాది 8.8 శాతంగా ఉన్న ఆర్థిక వృద్ధి రేటు ఈ యేడాది ఎకాఎకిన 9.2 శాతంగా నమోదైంది.

పారిశ్రామిక రంగం, తయారీ రంగంతో పాటు వ్యవసాయ, అనుంబంధ రంగాల్లో రాష్ట్రం మంచి పనితీరు కనబరుస్తున్నది. అలాగే దేశంలోనే తెలంగాణ 8వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలిచింది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న రాష్ట్రాల సమాచారం ఆధారంగా ఈ నివేదికను కేంద్రం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం ప్రణాళికబద్ధమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించడం, కట్టడిగా అప్పుల సేకరణ చేయడం, గ్రామీణ రంగానికి ఊతం ఇచ్చేలా చర్యలు తీసుకోవడం, భారీగా పెట్టుబడులను ఆకర్షించడం వల్లే జీఎస్‌‌‌‌డీపీలో పెరుగుదల కనబరుస్తోందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. 

తలసరి ఆదాయంలోనూ టాప్ 

తలసరి ఆదాయంలోనూ తెలంగాణే టాప్​లో ఉన్నది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.83 లక్షలుగా నమోదైంది. అంతకంటే ముందు గోవా, ఢిల్లీ వంటి చిన్న రాష్ట్రాలే ఉన్నాయి. గతేడాది డిసెంబర్​లో అధికారంలో వచ్చిన వెంటనే పెండింగ్​లో ఉన్న రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. గత నెలలో రుణమాఫీ కూడా అమలు చేసింది. ఈ రెండు స్కీంలతో ఏకంగా రూ.20 వేల కోట్ల మేర గ్రామీణ ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషించాయి.

అదేసమయంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇక జనవరిలోనే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన చేశారు. ఆ పర్యటనలో దాదాపు రూ.40,232 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చారు. ఇందులో కొన్ని కంపెనీలు ఇప్పటికే పనులు ప్రారంభించాయి. గత నెలలో అమెరికా టూర్​లోనూ భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించారు. ఐటీ, బయో టెక్నాలజీ, తయారీ రంగాలు, ఎఫ్ డీఐలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వస్తుండటంతో జీఎస్‌‌‌‌డీపీ పెరుగుతోందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.  

దేశానికి ఆదర్శంగా రాష్ట్రం

జీఎస్‌‌‌‌డీపీ, తలసరి ఆదాయం ఈ రెండూ ప్రగతి సూచికలు. వీటిలో తెలంగాణ మేటిగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అంచనా గణాంకాలు చెబుతున్నాయంటే.. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపులో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, మరింత పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం.  

 భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి