మైనర్పై అత్యాచారం కేసు.. సిక్కింలో నలుగురు మైనర్లు సహా 8 మంది అరెస్ట్

మైనర్పై అత్యాచారం కేసు.. సిక్కింలో నలుగురు మైనర్లు సహా 8 మంది అరెస్ట్

గ్యాంగ్‌‌‌‌టక్: సిక్కింలోని గ్యాల్షింగ్ జిల్లాలో కొన్ని నెలలుగా 13 ఏండ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో  నలుగురు మైనర్లు, ఒక మహిళ కూడా ఉన్నారు. బాధిత బాలిక తరగతిలో ఎప్పుడూ  నీరసంగా ఉండటాన్ని గమనించిన స్కూల్ అధికారులు..ఈ విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తెలిపారు. దాంతో  చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించింది. 

ఈ  సందర్భంగా బాలిక విస్తుపోయే విషయాలను కమిటీకి వివరించింది. ఇంటి పరిసరాల్లోని ఒక మహిళతో తనకు ఇటీవస పరిచయం అయిందని..ఆమె తనను ఇంటి పనుల్లో  సహాయం కోసం తరచూ పిలిచేదని బాలిక తెలిపింది. అక్కడ ఆ మహిళ భర్త.. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పింది. అంతేకాక, మరో ఇద్దరు వ్యక్తులతో తనపై లైంగిక దాడి చేయించిందని..తద్వారా వారి దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకునేదని వెల్లడించింది. ఏడాది నుంచి నలుగురు మైనర్లు కూడా తనపై లైంగిక దాడులు చేసినట్లు కమిటీకి బాలిక వివరించింది.  

బాలిక వాగ్మూలం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళను, బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆమె భర్తను, మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నలుగురు మైనర్లను జువెనైల్ కస్టడీలోకి తీసుకున్నారు.కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ప్రస్తుతం బాధిత బాలిక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉంది. ఆమెకు వైద్య చికిత్సతో పాటు కౌన్సెలింగ్ అందిస్తున్నారు.