
కొల్లాపూర్, వెలుగు : ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి స్వల్పంగా వరద ప్రవాహం మొదలైంది. కర్నాటక, మహారాష్ర్టతో పాటు ఏపీ, తెలంగాణల్లోనూ భారీ వర్షం కురవడంతో..నారాయణపూర్, ఆల్మట్టి డ్యామ్నుంచి వరద జూరాలకు వచ్చి చేరుతోంది. సప్తనదుల సంగమేశ్వరం, సోమశిల ప్రాంతాల మధ్య ప్రవహించే కృష్ణానదికి ప్రవాహం కొనసాగుతోంది.
దీంతో వేసవిలో 4 నెలలు తప్పించి ఏడాదంతా నీటిలోనే ఉండే సంగమేశ్వర క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరద ఎక్కువైతే ఆలయం నీటిలో మునిగి కనిపించకుండా పోయే అవకాశం ఉండడంతో తరలివస్తున్నారు. సెలవు దినం కావడంతో నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల జిల్లాలతో పాటు హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన భక్తులు ఎక్కువగా వస్తున్నారు. మరబోట్లపై నదిలో పర్యటిస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.