
- రక్సెల్-సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌లో ఘటన
- వాష్ రూమ్‌కు వెళ్లగా బంధించి యువకుడి అఘాయిత్యం
- పట్టుకుని సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించిన తల్లిదండ్రులు
పద్మారావునగర్, వెలుగు: రక్సెల్ -సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌రైలులో ఓ యువకుడు 12 ఏండ్ల ఆటిజం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి వాష్ రూమ్ కు వెళ్లిన బాలిక నోరు మూసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా ఆ దృశ్యాన్నంతా వీడియో తీశాడు. హైదరాబాద్నగరంలోని చారిత్రక ప్రదేశాలను చూడడానికి ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ ఇంజినీర్ కుటుంబం ఈ నెల 2న రక్సెల్-సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్రైలులో బయలుదేరింది.
ఈ దంపతులకు ఆటిజంతో బాధపడుతున్న12 ఏండ్ల పెద్ద కూతురు ఉంది. అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో అందరూ గాఢనిద్రలో ఉండగా.. రైలు కేల్జార్ రైల్వే స్టేషన్ దాటుతున్న సమయంలో బాలిక నిద్రలేచి వాష్ రూమ్ కు వెళ్లింది. అదే బోగీలో డోర్దగ్గర నిలబడి ఉన్న ఆగంతకుడు ఆ బాలిక నోరు నొక్కి వాష్ రూమ్ లోకి లాక్కెళ్లాడు. లోపలి నుంచి గడియ పెట్టి లైంగిక దాడి చేస్తూ వీడియో తీశాడు.
విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానంటూ బెదిరించి వదిలేశాడు. అయితే, బాలిక ఏడ్చుకుంటూ వెళ్లి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. అప్పటికీ నిందితుడు అదే బోగీలో డోరు వద్ద నిలబడి ఉండగా.. ఇతర ప్రయాణికుల సాయంతో బాలిక తండ్రి అతన్ని పట్టుకొని బంధించాడు. సెల్ ఫోన్ లాక్కొని పరిశీలించగా అందులో బాలికపై లైంగిక దాడి చేస్తూ తీసిన వీడియోలు కనిపించాయి.
దీంతో రైల్వే టోల్ ఫ్రీ నంబర్ 139 కు ఫోన్ చేశాడు. గురువారం ఉదయం రైలు సికింద్రాబాద్‌కు చేరుకున్నాక.. బాలిక తండ్రి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు బిహార్‌కు చెందిన వ్యక్తిగా తెలిసింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో తో పాటు ఇతర సెక్షన్ల కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఘటన కేల్జార్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న నేపథ్యంలో కేసును అక్కడికి బదిలీ చేయనున్నట్టు తెలిసింది. కాగా, రైల్వే పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షలతో పాటు ట్రీట్మెంట్ కోసం గురువారం రాత్రి గాంధీ దవాఖానకు తరలించారు.