రంగనాయక సాగర్ నీటి మళ్లింపుపై రగడ .. పనులను అడ్డుకున్న నంగునూరు రైతులు

 రంగనాయక సాగర్ నీటి మళ్లింపుపై రగడ .. పనులను అడ్డుకున్న నంగునూరు రైతులు
  • సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కమలాయపల్లి వద్ద స్వల్ప ఉద్రిక్తత
  • పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కమలాయపల్లి గ్రామ శివారులో రంగనాయక్​ సాగర్​ కాల్వ నుంచి తపాస్​పల్లి రిజర్వాయర్​ డి3 కాల్వలోకి సాగునీటి మళ్లింపు కోసం చేపట్టిన పనులను నంగునూరు మండల రై‌‌‌‌తులు అడ్డుకున్నారు. శనివారం చేర్యాల,- నంగునూరు మండల సరిహద్దులోని కమలాయపల్లి వద్ద ఇరిగేషన్​ అధికారులు పనులు ప్రారంభించారు. తపాసుపల్లి రిజర్వాయర్​ నుంచి కమలాయపల్లితో పాటు దానంపల్లి, అర్జునపట్ల, ఆకునూరు, లింగాపురం, దూల్మిట్ట గ్రామాల్లోని 6 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. 

ఈ విషయాన్ని మాజీ జడ్పీటీసీ గిరికొండల్​రెడ్డి రెండు రోజుల కింద భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మంత్రి ఉత్తంకుమార్​రెడ్డికి వివరించడంతో.. డి10​ కాల్వ నుంచి తాత్కాలికంగా పైప్​లైన్​ వేసి సాగునీటిని తపాసుపల్లి రిజర్వాయర్​ డి3 కెనాల్​లోకి మళ్లించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందులోభాగంగా అధికారులు మళ్లింపు పనులు ప్రారంభించగా, నంగునూరు మండల రైతులతో పాటు బీఆర్ఎస్​ నేతలు అక్కడికి చేరుకొని పనులను అడ్డుకున్నారు. నంగునూరు మండలంలోని పది గ్రామాలకు సాగునీరు అందదని, ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వాగ్వాదానికి దిగారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. చేర్యాల పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించడంతో ఆందోళన విరమించారు.