ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్కు జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షహ్జాది షోకాజ్నోటీసులు జారీ చేసారు. ఈ నెల 11న ఖమ్మం జిల్లాలో ప్రధాని 15 పాయింట్ల కార్యక్రమానికి షహ్జాది ఖమ్మం చేరుకున్నారు. మైనారిటీల అభివృద్దికి నిధుల కేటాయింపు అంశంపై చర్చించేందుకు అందుబాటులో ఉండాలని జాతీయ మైనారిటి కమిషన్ సభ్యులు హాజరవుతారని సీఎస్ ద్వారా సమాచారం అందించారు. ముందస్తు సమాచారం ఉన్నప్పటికి జిల్లా కలెక్టర్ , సీపీ విష్ణు వారియర్ అందుబాటులో లేరు.
మంత్రి పువ్వాడతో కలిసి కంటి వెలుగు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సీపీ వైరా మాజీ ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి హజరైయ్యారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన షహ్జాదికి జిల్లా అదనపు కలెక్టర్ మధుసూధన్ , లా & ఆర్డర్ డీసీపీ సుభాష్ చంద్ర బోస్ స్వాగతం పలికారు. సమావేశానికి సీపీ , కలెక్టర్ హజరు కాకపోవడంతో షహ్జాది అదనపు కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిరువురు రాకపోతే సమావేశం ప్రారంభించనని భీష్మించి కూర్చున్నారు. ఎంత సేపటికి కలెక్టర్, సీపీ రాకపోవడంతో షహ్జాది కార్యక్రమం నిర్వహించకుండానే వెళ్లిపోయారు
NSP గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ నిర్వహించి షహ్జాది కలెక్టర్ , సీపీల తీరును తప్పు పట్టారు. షహ్జాదికి జరిగిన అవమానానికి మైనారిటీలు కలెక్టర్ దిష్టిబొమ్మను దహనం చేసారు. జిల్లా కలెక్టర్ కు ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షహ్జాది షోకాజ్ నోటీసులు జారీ చేసారు. ముందస్తు సమాచారం ఇచ్చినా ఎందుకు హజరు కాలేదని ప్రశ్నించారు. అందుబాటులో లేనట్లైతే తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని. ఖమ్మం నగరంలో ఉండి జాతీయ కమీషన్ సమావేశానికి హాజరుకానందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.