
- కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుంది
- ఏఐసీసీ మైనారిటీ సెల్ చీఫ్ అబ్జర్వర్ హమ్మర్ ఇస్లాం
నర్సాపూర్, వెల్దుర్తి, వెలుగు : నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డికి ఎన్నికల్లో మద్దతిస్తామని మైనార్టీలు ప్రకటించారు. గురువారం నర్సాపూర్లోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ లో జరిగిన మైనారిటీల సమావేశానికి ఏఐసీసీ మైనారిటీ సెల్ చీఫ్ అబ్జర్వర్ హమ్మర్ ఇస్లాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని ఆయన విమర్శించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు ప్రసంగాల్లో మాట్లాడినప్పటికీ బీఆర్ఎస్, ఎంఐఎం నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు. సమావేశానికి హాజరైన ముస్లిం మైనారిటీ సోదరులు ఎన్నికల్లో ఆవుల రాజిరెడ్డికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. కార్యక్రమంలో టీపీసీసీ మైనార్టీ సెల్ సెక్రటరీ ఎంఏ హకీమ్, నాయకులు రిజ్వాన్, అల్తాఫ్, అక్రమ్, అబ్దుల్, అల్తాఫ్ రషీద్, ఇస్మాయిల్, ఫయాజ్ లు పాల్గొన్నారు.
గ్రామాల్లో విస్తృత ప్రచారం
నర్సాపూర్ మండలంలోని మూసాపేట్, రుస్తుంపేట్, ఎల్లారెడ్డి తండా, కొండాపూర్, నత్సాయపల్లి, మద్దూరు, పెద్దాపూర్ తండా, మాడాపూర్ తండా, గూడెంగడ్డ, తుల్జారాంపేట, ఎల్లాపూర్, అవంచ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి, వెల్దుర్తి మండలం శెట్టిపల్లి కలాన్ గ్రామంలో రాజిరెడ్డి భార్య శైలజ గురువారం కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల గురించి ఓటర్లకు వివరించి చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నర్సాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు, వెల్దుర్తి మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.