నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మైనార్టీ ఓట్లు కీలకంగా మారాయి. తమకు పక్కా అనుకున్న ఓట్లు కూడా ఈ సారి పడకుండా పోతాయేమోనని బీఆర్ఎస్ లీడర్లు లెక్కలు వేసుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు మజ్లిస్ పార్టీ సహా మైనారిటీ వర్గం ఓట్లు అధిక శాతం బీఆర్ఎస్ వెంట నడిచాయి. లోక్ సభ ఎన్నికలు వచ్చే సరికి స్టాండ్ మార్చి కాంగ్రెస్ వైపు మళ్లినట్లు తెలుస్తోంది.
విలేజ్‌లలో ఈ వాతావరణం స్పష్టంగా కనబడింది. బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన బాజిరెడ్డి గోవర్ధన్ మైనారిటీ ఓట్లపై నమ్మకంతో ముందుకు సాగారు. ఆ వర్గం ఓట్లు చీలాయని పోలింగ్ రోజు కన్ఫర్మ్ కావడంతో గెలుపు లెక్కలు మారిపోయాయంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి. జీవన్‌రెడ్డి మారిన పొలిటికల్ పరిణామాలు మైనారిటీ వర్గాన్ని తమ పార్టీకి చేరువచేశాయని విశ్వసిస్తున్నారు. 90 శాతం ఓట్లు తమకే పడ్డాయనే ధీమాతో ఉన్నారు. దాదాపు మూడు లక్షల మైనార్టీ ఓట్లు ఉండగా వీటిపై కాంగ్రెస్ ధీమా పెట్టుకుంది.
మహిళలు తమ వెంటే నడిచారని నమ్మకం
నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో పురుషులు 5,52,465 ఓటు వేయగా 6,73,629 మహిళలు, ఇతరులు 39 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు ఎవరిని ఆదరించారనే పాయింట్‌పై ఎవరి నమ్మకాలు వారికున్నాయి. డ్వాక్రా మహిళల మద్దతు పొందడానికి చేసిన ప్రయత్నం ఫలించిందని బీజేపీ విశ్వసిస్తుండగా, కాంగ్రెస్ అమలు చేసిన ఫ్రీబస్ జర్నీ, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ఓట్లు గుమ్మరించిందని కాంగ్రెస్ ఆశతో ఉంది. బీఆర్‌ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమలు చేసిన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ స్కీంలకు మహిళల్లో మంచి ఆదరణ ఉందని కచ్చితంగా ఓట్లు వేశారని బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నమ్మకంతో ఉన్నారు. తమ అంచనాలపై మూడు పార్టీలు విలేజ్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నాయి.
ఎక్కడ ఫ్లస్ ఏదీ మైనస్
నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులకు క్రాస్ ఓట్ల భయం పట్టింది. తమకు పక్కా అనుకున్న ఓట్లు ప్రత్యర్థులకు వెళ్లాయని అనుమానిస్తూ గెలుపు అంచనాలపై హైరానా చెందుతున్నారు. పోలింగ్ బూత్‌ల వారిగా ఓట్ల లెక్కలు వేస్తున్నారు. ఒక చోట తగ్గిన ఓట్లు ఎక్కడ భర్తీ అవుతాయో చర్చించుకుంటున్నారు. పార్టీ బూత్ కమిటీ ప్రతినిధులతో ప్లస్, మైనస్ లెక్కలు వేస్తున్నారు.
ఎన్నికల అలసట కాస్త తీర్చుకున్న మరుక్షణం నుంచి అభ్యర్థులు ఈ విషయంలో బిజీ అయ్యారు. మైనారిటీ ఓట్లపై అనుమానం పార్లమెంట్ సెగ్మెంట్లోని ఏడు అసెంబ్లీ స్థానాలలో మొత్తం 17,04,867 మంది ఓటర్లు ఉండగా అందులో మైనారిటీ ఓటర్లు సుమారు 3 లక్షల దాకా ఉన్నట్లు అంచనా. బీజేపీ నుంచి పోటీ చేసిన అర్వింద్ ఫస్ట్ నుంచి ఈ ఓట్లపై దాదాపు ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు మజ్లిస్ పార్టీ సహా మైనారిటీ వర్గం ఓటర్లు అధిక శాతం బీఆర్ఎస్ వెంట నడిచారు.
యూత్ ఎటు వైపో
ఎన్నికల టైంకు కొత్తగా ఓటు హక్కు పొందిన 18–19 వయస్సు ఓటర్లు 50,963 మంది ఉన్నారు. 29 ఏండ్లలోపు వారు 3,69,439 ఓటర్లుగా ఉండగా 39 ఏండ్లకు లోపు వారు అత్యధికంగా 4,17,862 మంది ఉన్నారు. వీరు ఎటు మొగ్గితే ఆ అభ్యర్థి గెలుపు పక్కాగా ఉంటది. యూత్ ఓట్లను బీజేపీ నమ్ముతుండగా జాబ్ అవకాశాలు ఓపెన్ చేసినందున వారి ఓట్లలో సింహ భాగస్వామ్యం తమదేనన్న ధీమా కాంగ్రెస్‌లో ఉంది. సెగ్మెంట్లోని సుమారు మూడు లక్షల రైతులలో ఓటింగ్‌లో పాల్గొన్న వారి వివరాలు సేకరిస్తునారు. రిజల్టును ప్రభావితం చేసే మున్నూరుకాపు, పద్మశాలి, ఎస్సీ సామాజిక వర్గం ఓట్లలో పోలైన వాటిని బూత్‌ల వారిగా సేకరించి గెలుపు లెక్కలు వేసుకుంటున్నారు.