నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో ముస్లిం మైనారిటీ ఓట్లు కీలకంగా మారాయి. బోధన్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో మైనార్టీల ఓట్లు గెలుపొటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. వీరి ఓట్లు గంపగుత్తగా పడితే గెలుపు ఈజీ అనే భావనలో ప్రధాన పార్టీల ప్రజాప్రతినిధులు ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు.
బోధన్‌లో కీలకం
బోధన్ నియోజకవర్గంలో మొత్తం 2,04,212 ఓట్లు ఉండగా సుమారు 38 వేల ఓట్లు ముస్లిం సామాజిక వర్గానికి చెందినవి ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. దీంతో వారి ఆదరణ పొందడానికి అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. 1980 లో మారిన సమీకరణల కారణంగా దాదాపు ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ తరఫున ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలో దించుతున్నారు. 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ షకీల్2009 అసెంబ్లీ ఎలక్షన్‌లో మహాకూటమి అభ్యర్థిగా అప్పటి టీఆర్ఎస్ పక్షాన పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం 2014, 2018 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.
ఆయన సామాజిక వర్గం అండతోనే చట్టసభకు వెళ్లగలిగినట్టు నమ్ముతారు. ఆయనకు ముందు 1985, 94 ఎలక్షన్లలో టీడీపీ నుంచి బషీరుద్దీన్ బాబూఖాన్ పోటీ చేయగా సులువుగా గెలిచారు. తెలుగుదేశం లేక ముందు కాంగ్రెస్‌లో గులాం సంధానీ హవా నడిచేది. 1994 ఎలక్షన్‌లో ఆర్మూర్ ప్రాంతానికి చెందిన తాహెర్‌ను బోధన్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పోటీ చేయించింది. దీనికి కారణం ఆయన మైనారిటీ వర్గానికి చెందిన లీడర్ కావడమే. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఈసారి జరగనున్న ఎలక్షన్ విషయానికి వస్తే నియోజకవర్గంలో ప్రధాన పార్టీల లీడర్ల దృష్టి మైనారిటీ ఓట్ల వైపే ఉంది. మజ్లిస్ నుంచి అభ్యర్థిని నిలబెడతామని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఈ మధ్య ప్రకటించారు. ఈ నేపథ్యంలో సమీకరణలు మారే సూచనలు ఉన్నాయి.
నిజామాబాద్ అర్బన్ లో మైనారిటీలే కీలకం
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 2,68,901 ఓట్లు ఉండగా సుమారు 46 వేల ఓట్లు మైనారిటీ వర్గాలవి ఉంటాయని అంచనా. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున తాహెర్ టికెట్ఆశిస్తున్నారు. స్టేట్పార్టీలో కులమత సమీకరణలు అనుకూలిస్తే తాను అభ్యర్థి కావొచ్చని అంచనా వేస్తున్నారు. 1985లో తాహెర్ నిజామాబాద్‌లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. మైనారిటీ అభ్యర్థి ఏ పార్టీ నుంచి పోటీ చేయని సందర్భంలో వారి ఓట్ల కోసం అన్ని పార్టీలు ఎత్తులు వేస్తాయి. మజ్లిస్ పార్టీకి అండగా ఉండే మైనారిటీలు మద్దతు ఇవ్వడం వల్లే 2014, 2018 ఎలక్షన్లలో గెలిచానని ఎమ్మెల్యే గణేష్‌గుప్తా చెబుతుంటారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా డి.
శ్రీనివాస్ పాలిటిక్స్ లో యాక్టివ్‌గా ఉన్నప్పుడు నిజామాబాద్ నియోజకవర్గ మైనార్టీలో మంచి పట్టు కలిగి ఉండేవారు. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమం నడిచిన కాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన మైనారిటీల ఓట్ల కోసం చేసిన వ్యాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా పెను దూమారమే లేపింది. మైనారిటీ గంపగుత్త ఓట్ల కోసం లీడర్లు ఎంతదాక పోవడానికైనా సిద్ధమని చెప్పేందుకు డీఎస్ కామెంట్లే నిదర్శనం. మైనారిటీల రాజకీయ ప్రాబల్యాన్ని నియంత్రించేందుకు 2009 ఎలక్షన్‌లో మెజారిటీ ఓటర్లు బీజేపీకి చెందిన యెండల లక్ష్మీనారాయణకు ఎమ్మెల్యేగా గెలిపించారు. అయినా అర్బన్ లో ఇప్పటికీ మైనారిటీ ఓటు రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి.