Paris Olympics 2024: చేజారిన మరో పతకం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయికి నిరాశ

Paris Olympics 2024: చేజారిన మరో పతకం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయికి నిరాశ

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు పతకాలు తృటిలో చేజారుతున్నాయి. చాలా ఈవెంట్ లలో మన ఆటగాళ్లు తుది మెట్టుపై బోల్తా పడుతున్నారు. 100 గ్రాములు అధిక బరువుతో వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు తర్వాత భారత్ కు వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో మెడల్ మిస్ అయింది. వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మహిళల 49 కేజీల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది.

బుధవారం అర్ధరాత్రి ముగిసిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో భారత స్టార్‌ మీరాబాయి తృటిలో మెడల్ కోల్పోయింది. ఆమె మొత్తం 199కిలోలు (88+111) ఎత్తి నాల్గవ స్థానానికి నిలిచి ఒలింపిక్ పతకాన్ని కేవలం ఒక కేజీ తేడాతో కోల్పోయింది.ఫైనల్లో మొత్తం 12 మంది పోటీ పడ్డారు. మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు... తర్వాత క్లీన్‌ అండ్‌ జెర్క్‌ అంశంలో 111 కేజీలు బరువెత్తింది. గత టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన మీరాబాయి ఈ సారి ఆ ఫీట్ రిపీట్ చేయలేకపోయింది.

పారిస్‌లోనూ ఈమె పతకం గెలిచి సాధించి ఉంటే ఒలింపిక్స్‌ వ్యక్తిగత క్రీడాంశంలో రెండు పతకాలు గెలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా అరుదైన జాబితాలో నిలిచేది. మరోవైపు క్వార్టర్స్‌లో మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు 1-3తో జర్మనీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. నీరజ్ చోప్రా, భారత హాకీ జట్టుపైనే పతక ఆశలు మిగిలి ఉన్నాయి.