ఇండియా స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను వరల్డ్ ఛాంపియన్ షిప్స్లో సిల్వర్ మెడల్ సాధించింది. మణికట్టుకు గాయం అయినా లెక్క చేయకుండా బరువులు ఎత్తి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మొత్తంగా 200 కేజీలు ఎత్తిన మీరాబాయి..సిల్వర్ను దక్కించుకుంది. అగ్రస్థానంలో నిలిచిన చైనా వెయిట్ లిఫ్టర్ జియాంగ్ హూహువా 206 కేజీలతో గోల్డ్ మెడల్ను సాధించింది.
వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో పోటీ పడింది. ఇందులో భాగంగా ఫైనల్లో స్నాచ్ విభాగంలో 87 కేజీలు ఎత్తింది. ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 113 కేజీల బరువు ఎత్తడంతో మొత్తం 200 కేజీలకు చేరింది. అయితే చైనా లిఫ్టర్ జియాంగ్ హూహువా మీరా కంటే 6 కేజీలు ఎక్కువ ఎత్తడంతో గోల్డ్ మిస్ అయింది. అటు చైనా వెయిట్ లిఫ్టర్ హో జీహువా 198 కేజీలతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని కైవసం చేసుకుంది.
2017 వరల్డ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ నెగ్గిన మీరాబాయి..ఈ సారి కూడా స్వర్ణాన్ని సాధించాలని పట్టుదలతో బరిలోకి దిగింది. అయితే సెప్టెంబర్ లో జరిగిన శిక్షణ శిబిరంలో చాను మణికట్టుకు గాయమైంది. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోయినా..వరల్డ్ ఛాంపియన్ షిప్లో బరిలోకి దిగింది. నొప్పిని భరిస్తూనే బరువులు ఎత్తి.. రజత పతకాన్ని సాధించింది.