ఓ మహిళ గంట వ్యవధిలో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన పాకిస్థాన్‌లో జరిగింది. ఇందులో నలుగురు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లల ఉన్నారు. రావల్పిండికి చెందిన మహ్మద్ వహీద్ భార్య జీనత్ వహీద్‌కు ఏప్రిల్ 19 శుక్రవారం రోజున నొప్పులు రావడంతో జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో అమె గంట వ్యవధిలో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది.
తల్లితో సహా శిశువులందరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. వారందరూ ఒక్కొక్కరు రెండు కేజీల బరువు ఉన్నారని తెలిపారు. జీనత్‌కి ఇది మొదటి ప్రసవం కావడం విశేషం. తమ ఆసుపత్రిలో జరిగిన ఈ అద్భుతాన్ని చూసిన సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. జీనత్, వహీద్ కుటుంబాలు కూడా ఆనందంగా ఉన్నాయి.
ఒక్కసారిగా తమ కుటుంబంలోకి వచ్చిన ఈ సంతోషానికి అవధులు లేవని అంటున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత జీనత్‌కు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని డాక్టర్ ఫర్జానా తెలిపారు. అయితే, ఇది అంత సీరియస్ కాదని.. మరికొద్ది రోజుల్లో ఆమె పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని చెప్పారు.