ఆ చెట్టును హత్తుకుంటే చాలు రోగాలు మటు మాయం

ఆ చెట్టును హత్తుకుంటే చాలు రోగాలు మటు మాయం

మామూలుగా జ్వరం వస్తే..స్థానికంగా ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్తాం. ఎంతకి తగ్గక పోతే స్పెషలిస్ట్ ల దగ్గరకు వెళ్తాం. కానీ ఇక్కడి జనం మాత్రం ఓ చెట్టు దగ్గరకు వెళ్తారు. చెట్టును తాకితే చాలు ఎలాంటి వ్యాధి అయినా నయం అవుతుంది. ఆ ఊరి వాళ్లే వారు కాదు…చుట్టు పక్కల గ్రామాల నుంచి రోజుకూ వేలాది మంది చెట్టు దగ్గరకు వస్తుంటారు. సూపర్ స్పెషలిటీ ఆస్పత్రికి వెళ్లినా తగ్గని రోగాలు ఆ చెట్టు దగ్గరకు వెళితే తగ్గిపోయాయంటున్నారు.

మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వ్‌లో మహువా అనే చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గరకు వెళ్లి దానిని హత్తుకుంటే చాలు రోగాలు తగ్గిపోతాయని ప్రచారం జరిగింది. దీంతో ప్రతీ రోజూ ఆ చెట్టు దగ్గరకు వేల మంది వచ్చి వెళ్తున్నారు. రూప్ సింగ్ ఠాకూర్ అనే ఓ రైతు ద్వారా ఆ చెట్టు గురించి అందరికీ తెలిసింది. గతంలో కుంటుతూ నడిచేవాడు… ఒకరోజు పనిలో భాగంగా అడవికి వెళ్ళాడు. అప్పుడు అనుకోకుండా ఆ చెట్టును ఆనుకున్నానని తెలిపాడు. అలా పది నిమిషాలపాటు చెట్టుకు అతుక్కుపోయానని…ఆ తర్వాత కుంటకుండా మామూలుగానే నడిచాని చెప్పాడు. ఆ రోజు నుంచి ప్రతి ఆదివారం, బుధవారం ఆ చెట్టు దగ్గరకు వెళ్తున్నట్లు తెలిపాడు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానన్నాడు.

ఈ విషయం తెలిసిన స్థానికులు ..రోగాలను తగ్గించుకోవడం కోసం అడవి బాట పట్టారు. వెళ్లి ఆ చెట్టును హత్తుకుంటున్నారు. వస్తున్న వారికి రోగాలు తగ్గటం మాట ఎంత వరకూ నిజమో గానీ స్థానికంగా వ్యాపారం మాత్రం బాగా పెరిగిపోయింది. వాటర్ బాటిళ్లు, చిరుతిళ్ళు, కొబ్బరి బోండాలు ఇలా ఎవరికి తోచించి వారు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నారు. కొందరు ఆ చెట్టు ఫొటోలను కూడా అమ్ముతున్నారు. దీంతో అడవిలో చెత్త భారీగా పెరిగిపోతోంది. భారీ సంఖ్యలో జనం రావడంతో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.