మిర్చికి ధర పెడ్తలేరు..దాచుకోనిస్తలేరు!

  •    వరంగల్‍ ఏనుమాముల మార్కెట్​లో వ్యాపారులు, దళారుల దోపిడీ
  •     సిండికేట్​గా మారిన వ్యాపారులు   
  •     క్వింటాల్‍ మిర్చి రూ.20 వేలు ఉంటే, రూ.14 వేలలోపే చెల్లింపు 
  •     పంటను దాచుకుందామంటే కోల్డ్ స్టోరేజీలు బ్లాక్‍ చేసిన దళారులు
  •     అరిగోస పడ్తున్న రైతులు.. కోల్డ్ స్టోరేజీల ఎదుట ఆందోళన

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ ఏనుమాముల మార్కెట్​లో వ్యాపారులు, కోల్డ్ స్టోరేజీ యజమానులు కుమ్మక్కై మిర్చి రైతులను అరిగోస పెడ్తున్నరు. చేతికొచ్చిన పంటను అమ్ముకుందామని రైతులు మార్కెట్‍ కు వస్తే వ్యాపారులు కనీస గిట్టుబాటు ధర పెడ్తలేరు. దీంతో ఎంతోకొంత రేటు పెరిగాక అమ్ముకుందామనే ఆలోచనతో పంట దాచుకోడానికి రైతులు కోల్డ్ స్టోరేజీలకు వెళ్తే అక్కడి ఓనర్లు చాన్స్​ఇస్తలేరు. దీంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి వాహనాల్లో పంటను తీసుకొచ్చిన రైతులు.. రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో శుక్రవారం కోల్డ్ స్టోరేజీల ఎదుట ఆందోళనకు దిగారు. 

జెండా పాట కంటే 7 వేల దాకా తక్కువ..

రాష్ట్రంలో ఈసారి దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. పంట చేతికి రావడంతో కొద్దిరోజులుగా వరంగల్‍ ఏనుమాముల మార్కెట్‍కు తీసుకొస్తున్నారు. ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల రైతులు కూడా పెద్ద ఎత్తున మిర్చి పంటను మార్కెట్ కు తీసుకొస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు దోపిడీకి తెగబడుతున్నారు. ఉదయం అధికారులు, వ్యాపారులు కలిసి జెండా పాట పేరుతో మిర్చి రకాన్ని బట్టి  ధర ఫిక్స్​చేస్తున్నారు. క్వాలిటీ ఆధారంగా రూ.500, రూ.వెయ్యి అటుఇటుగా కొనుగోలు చేయాలి. కానీ ఈ విషయంలో అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై జెండా పాటలో రూ.6 వేల నుంచి రూ.7 వేల దాకా కోత పెడ్తున్నారు. దేశీ రకానికి క్వింటాల్‍ రూ.36 వేల నుంచి రూ.40 వేలు,  తేజ రకానికి రూ.20 వేల నుంచి రూ.22 వేలు జెండా పాట పెడ్తున్న వ్యాపారులు... ఒకరిద్దరు రైతులకు మాత్రమే ఆ రేటు కట్టిస్తున్నారు. మిగిలిన రైతులకు  దేశీరకానికి రూ.30 వేలు, తేజ రకానికి రూ.14 వేలలోపు మాత్రమే చెల్లిస్తున్నారు. వ్యయప్రయాసలతో ఇంతదూరం వచ్చిన చాలామంది రైతులు పంటను వెనక్కి తీసుకెళ్లలేక వ్యాపారులు చెప్పిన రేటుకు అమ్ముకుంటున్నారు. కానీ ధర పెరిగాక అమ్ముకుందామని భావిస్తున్న రైతులు కొంతమంది పంటను తీసుకుని కోల్డ్​ స్టోరేజీలకు వెళ్తే.. అక్కడ దళారులు అడ్డుకుంటున్నారు. 

దళారుల చేతుల్లో కోల్డ్ స్టోరేజీలు.. 

వ్యాపారులు గిట్టుబాటు ధర ఇవ్వనప్పుడు రైతులు తమ పంటను కోల్డ్​స్టోరేజీలో దాచుకోవాలని సర్కార్ సూచించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. ఏనుమాముల మార్కెట్ చుట్టూ ఉన్న 25 స్టోరేజీల్లో దాదాపు 25 లక్షల మిర్చి బస్తాలు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. దీంతో వ్యాపారుల మోసాన్ని గ్రహించిన రైతులు.. తమ పంటను దాచుకోడానికి కోల్డ్ స్టోరేజీల బాటపడ్తున్నారు. అయితే ఇది తెలుసుకున్న దళారులు.. కోల్ట్ స్టోరేజీల ఓనర్లతో కుమ్మక్కై వాటిని బ్లాక్‍ చేస్తున్నారు. స్టోరేజీలన్నీ నిండిపోయాయని వాటి ఓనర్లు చెప్తుండడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. 

మా పంటను దాచుకోనివ్వట్లే.. 

ఏనుమాముల మార్కెట్‍కు మిర్చి అమ్ముదామనిపోతే అడ్తిదారులు క్వింటాల్‍ ధర రూ.14 వేల లోపే చెప్పిన్రు. ఎంతోకొంత ధర వచ్చే వరకు దాచుకుందామని పంటను కోల్డ్​ స్టోరేజీకి తీసుకొచ్చిన. రెండు రోజులుగా మిర్చి వాహనాల్లోనే ఉంది. స్టోరేజీ లోపల స్థలం లేదని చెబుతున్రు. వారికి టచ్‍లో ఉండే దళారులు పట్టుకొచ్చే బస్తాలను మాత్రం తీసుకుంటున్నరు. రైతుల కోసం పెట్టామని చెప్పిన కోల్డ్ స్టోరేజీలు వ్యాపారులకే ఇస్తున్నరు. కలెక్టర్‍ స్పందించి అసలు రైతులకు న్యాయం చేయాలి.  
– రాజమల్లు, దుగ్గొండి గోపాలపురం, వరంగల్‍

ధర్నా చేసిన రైతులు..

మిర్చి ధర తగ్గించి వ్యాపారులు దోచుకుంటున్నారని, దీంతో రేటు పెరిగే దాకా పంటను దాచుకుందామని కోల్డ్​స్టోరేజీలకు వస్తే దళారులు వాటిని బ్లాక్​ చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పలువురు రైతులు శుక్రవారం వరంగల్​లోని కోల్డ్​ స్టోరేజీల ముందు ధర్నా చేశారు. వ్యాపారులతో కోల్డ్​స్టోరేజీల ఓనర్లు కుమ్మక్కయ్యారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామునే మిర్చి రైతులు ఏనుమాముల మార్కెట్​చుట్టూ ఉన్న కోల్డ్ స్టోరేజీలకు చేరుకున్నారు. ఈ స్టోరేజీల్లో 70 శాతం వరకు రైతులకే కేటాయించాల్సి ఉండగా.. ఓనర్లు మాత్రం లోపల స్థలం లేదని చెప్పడంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఒక్కరోజే కోల్డ్​ స్టోరేజీల ముందు దాదాపు 10 వేల నుంచి 12 వేల బస్తాలతో కూడిన వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో పోలీసులు చేరుకుని దాదాపు 3 వేల బస్తాలను స్టోరేజీల్లో పెట్టించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్‍ స్పందించి న్యాయం చేయాలని రైతులు కోరారు.