మండిపడ్డ మిర్చి రైతు: వ్యాపారులు ధర తగ్గించడంతో ఆందోళన

    వరంగల్ ఏనుమాముల మార్కెట్లో ఫర్నీచర్​ ధ్వంసం

    ఇష్టమొచ్చినట్టు దోచుకుంటున్నారని మండిపాటు

    రంగంలోకి పోలీసులు, మార్కెట్​ అధికారులు

    వ్యాపారులు, రైతులతో సమావేశమై చర్చ

    ధర పెంచేందుకు ఓకే అనడంతో శాంతించిన రైతులు

వరంగల్​ ఏనుమాముల మార్కెట్లో వ్యాపారులు ఉన్నట్టుండి ధర తగ్గించేయడంతో మిర్చి రైతులు కన్నెర్ర చేశారు. నిన్నమొన్నటి వరకు మిర్చి క్వింటాల్​రూ.22 వేల వరకు పలికగా సోమవారం రూ.15 వేల వరకే ఇస్తామనడంతో ఆవేదనకు లోనయ్యారు. వ్యాపారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. యార్డులోని ఆఫీసులో ఉన్న ఫర్నీచర్​ను ధ్వంసం చేసి, ధర్నా చేశారు. మార్కెట్​చైర్మన్​ వచ్చి వ్యాపారులతో మాట్లాడి, ధరలు పెంచేలా చర్యలు తీసుకోవడంతో ఆందోళన విరమించారు.

వరంగల్ ఏనుమాముల మార్కెట్లో శుక్రవారం వరకు తేజ రకం మిర్చి క్వింటాల్​కు రూ.22 వేల వరకు పలికింది. శని, ఆదివారం సెలవు కావడంతో సోమవారం పెద్ద సంఖ్యలో రైతులు మార్కెట్​కు సరుకు తెచ్చారు. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా ఏపీలోని కర్నూల్, అనంతపురం ప్రాంతాల నుంచీ వచ్చారు. ఆదివారం రాత్రికే భారీగా మిర్చి మార్కెట్​యార్డుకు వచ్చింది. ఇది చూసిన వ్యాపారులు ధర తగ్గించేశారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో జెండా పాట నిర్వహించి.. తేజ రకానికి క్వింటాల్​కు రూ.18,600 గరిష్ట ధర నిర్ణయించారు. కానీ తర్వాత కొనుగోలు చేసేటప్పుడు క్వాలిటీ అని, తేమ అని సాకులు చెప్తూ.. రూ.15 వేలలోపే చెల్లిస్తామన్నారు. దీంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. వ్యాపారులు దగా చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. కొద్దిసేపట్లోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు రైతులు యార్డు ఆఫీసులోకి వెళ్లి ఫర్నీచర్​ను ధ్వంసం చేశారు. ఇష్టమొచ్చినట్టు ధరలు తగ్గించేస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు.

ధర పెంచుతామనడంతో..

మార్కెట్​అధికారులు పోలీసులకు, చైర్మన్​ సదానందంకు సమాచారమిచ్చారు. దీంతో వారు మార్కెట్​కు వచ్చి వ్యాపారులు, అడ్తిదారులు, రైతులతో సమావేశమయ్యారు. వ్యాపారులతో మాట్లాడి ధర పెంచేందుకు ఒప్పించడంతో.. రైతులు ఆందోళన విరమించారు.

మూడు గంటల పాటు..

మిర్చికి మంచి ధర పలుకుతుండటంతో చాలా మంది రైతులు ఆదివారం సాయంత్రం వరకే సుమారు 15 వేల బస్తాల మిర్చిని మార్కెట్​కు తెచ్చారు. వ్యాపారులు ధరలు తగ్గించడం, ఆందోళన నేపథ్యంలో సుమారు మూడు గంటల పాటు మార్కెట్​ స్తంభించిపోయింది. తిరిగి 11.30 గంటల సమయంలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వ్యాపారులు మిర్చి రకం, క్వాలిటీని బట్టి రూ.9 వేల నుంచి రూ.18,600 వరకు చెల్లించారు. మిర్చి బాగానే ఉన్నా నాణ్యత, తేమ సాకుతో తక్కువ ధర కట్టిస్తున్నారని రైతులు ఆరోపించగా.. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్​ తగ్గిందని, క్వాలిటీ సరిగా లేకనే ధర తగ్గిందని వ్యాపారులు అంటున్నారు.

 

ఇష్టమొచ్చినట్టు దోచుకుంటున్నరు

రెండు రోజుల్లోనే మిర్చి రేటును ఐదు వేలకు పైగా తగ్గించిన్రు. మార్కెట్లో రైతులను పట్టించుకునేటోళ్లు లేక వ్యాపారులు ఇష్టమొ చ్చినట్టు దోచుకుంటున్నరు. పంట సాగుకు ఎరువులు, పురుగు మందుల నుంచి ప్రతి చోటా ఎవరికి వాళ్లు దోచుకుంటనే ఉన్నరు.

– మోహన్, రైతు, కురవి

అప్పు తీరేదెట్ల..?

ఈ ఏడాది మిర్చి పంట ఎక్కువ సాగైంది. పెట్టుబడి ఖర్చు పెరిగింది. దిగుబడి కూడా సరిగా రాలేదు. ఇప్పుడు ధరలు తగ్గించిన్రు. క్వింటాల్​కు రెండు రోజుల కిందటి కంటే ఐదారు వేలు తక్కువ కట్టిస్తున్నరు. అప్పులెట్ల తీర్చాల్నో అర్థమైతలేదు

– రమేశ్​, రైతు, మహబూబాబాద్