- రేటు పెరుగుతుందన్న ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన రైతులు
- సీజన్‌లో రూ. 20 వేలకుపైగా పలికిన క్వింటాలు మిర్చి
- ప్రస్తుతం రూ. 15 వేల నుంచి రూ. 19 వేల మధ్యే రేటు
- కిరాయిలు భరించలేక నష్టానికే అమ్ముకుంటున్న రైతులు
ఖమ్మం, వెలుగు : రేటు పెరుగుతుందన్న ఆశతో మిర్చి పంటను కోల్డ్ స్టోరేజీల్లో దాచుకున్న రైతులకు ఇప్పుడు కూడా నష్టాలే మిగులుతున్నాయి. గతేడాది క్వింటాల్ మిర్చి రూ.25 వేలు పలుకగా, ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో రూ. 21 వేలు మాత్రమే పలికింది. దీంతో సీజన్ ముగిసిన తర్వాత మంచి రేటు వస్తుందన్న ఆశతో వేలాది మంది రైతులు తమ పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. కానీ ఈ ఏడాది మిర్చీ సీజన్ ప్రారంభమై కొత్తగా తోటలు వేస్తున్నా రేటు మాత్రం పెరగడం లేదు. దీంతో నాలుగైదు నెలలుగా కోల్డ్ స్టోరేజీల కిరాయిలు కట్టిన రైతులు ఇప్పుడు వచ్చిన రేటుకే అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆర్డర్లు లేవంటూ రేటు తగ్గింపు
ఖమ్మం జిల్లాలో మొత్తం 48 కోల్డ్ స్టోరేజీలు ఉండగా ఇందులో 46.98 లక్షల మిర్చి బస్తాలు నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఇందులో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నాటికి 30.43 లక్షల మిర్చి బస్తాలు నిల్వ ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 22.82 లక్షల బస్తాలు రైతులకు చెందినవి కాగా, మిగిలిన 7 లక్షల బస్తాలు ట్రేడర్లవని తెలుస్తోంది. అయితే చాలా మంది ట్రేడర్లు రైతుల పేర్లతో, వారి పాస్‌బుక్‌లపైనే మిర్చి నిల్వచేసినట్లు సమాచారం. రూ.20 వేల కంటే తక్కువ ధరకు పంట కొనుగోలు చేసిన వ్యాపారులు, ట్రేడర్లు, వారి పేర్లపైనే కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు.
ఖమ్మం నగరంలో, సమీపంలో ఉన్న కోల్డ్ స్టోరేజీల్లో ఒక్కో బస్తాకు రూ.200 నుంచి రూ.240 వరకు తీసుకుంటుండగా, నగరానికి దూరం ఉన్న స్టోరేజీల్లో రూ.150 వరకు కిరాయి తీసుకుంటున్నారు. ప్రస్తుతం మిర్చి అత్యధికంగా రూ.19 వేలు పలుకుతోంది. కానీ ఎక్కువ శాతం రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకే ట్రేడర్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాల నుంచి ఆర్డర్లు లేకపోవడం వల్లే రేటు పెరగడం లేదని చెబుతున్నారు. దీంతో చాలా మంది రైతులు కిరాయిలు కట్టుకుండా నష్టాలను మరింత పెంచుకోవడం ఇష్టం లేక వచ్చిన రేటుకే మిర్చీని అమ్ముకుంటున్నారు. సీజన్‌లో రూ.కోట్లలో పెట్టుబడి పెట్టి పంటను కొని నిల్వ చేసిన వ్యాపారులు కూడా ఒక్కో బస్తాకు రూ.2 వేల వరకు నష్టపోయామని లబోదిబోమంటున్నారు.
రూ.5 లక్షల వరకు నష్టపోయా
గతేడాది నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశా. నాలుగైదు నెలల కింద క్వింటాల్ రేటు రూ.22,200 ఉండడంతో ఇంకా పెరగుతుందన్న ఆశతో 250 బస్తాలను కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేశా. ఒక్కో బస్తాకు రూ.192 చొప్పున నెలకు రూ.50 వేల వరకు కోల్డ్ స్టోరేజీ కిరాయిలే అయ్యాయి. కిరాయి భారం పెరుగుతుండడంతో ఇటీవల రూ.18,500 చొప్పున కొన్ని బస్తాలు, రూ.17,500 చొప్పున మిగిలిన బస్తాలు అమ్మేశా. మిర్చి నిల్వ చేయడం వల్ల సుమారు రూ.5 లక్షల వరకు నష్టపోయా.
- హనుమంతరావు, మిర్చి రైతు, చింతపల్లి
జోరుగా ఆర్డీ దందా
రైతుల కష్టాలు, సీజన్లతో సంబంధం లేకుండా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఆర్డీ (రేట్ డిఫరెన్షియేట్) దందా జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వాలిటీ మిర్చిని క్వింటాల్‌కు రూ.14 వేల నుంచి 18 వేల వరకు కొనుగోలు చేసినప్పటికీ మార్కెట్ నుంచి బయటకు వెళ్లే టైంలో మాత్రం తాలుగా చూపి రికార్డుల్లో రూ. 9 వేలుగానే ఎంట్రీ చేస్తున్నారు. దీంతో ఆ రేటు ప్రకారమే మార్కెట్‌కు సెస్ కడుతూ ప్రభుత్వ ఖజానాకి గండికొడుతున్నారు.
ఇలా తప్పుడు ఎంట్రీతో బయటకు వెళ్లిన మూడు మిర్చీ లోడ్ లారీలను గతేడాది కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు పట్టుకున్నారు. దీంతో ఈ దందాకు అప్పట్లో తాత్కాలికంగా బ్రేక్ వేసిన వ్యక్తులు ఇటీవల మళ్లీ కొనసాగిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ఆఫీసర్ల కనుసన్నల్లో నలుగురైదుగురు ట్రేడర్లు మాత్రమే ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.