ఖమ్మం: మిర్చి రైతుకు కాలం కాస్త కలిసొస్తోంది. మద్దతు ధర కూడా దొరకని మిర్చి రికార్డు ధర పలుకుతోంది. ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో మిర్చి రికార్డు ధర పలికింది. మేలు రకం మిర్చి క్వింటాల్ కు 23వేల రేటు దక్కింది. కొనుగోళ్లు ప్రారంభమైన రెండు రోజులకే భారీగా ధరలు పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పడిన వర్షానికి... తడిచిన మిర్చి రకానికి రేటు కాస్త తక్కువగా ఉంది. రంగు మారిన మిర్చి రకానికి 14 నుంచి 15వేల రూపాయల వరకు రేటు పలుకుతోంది. ఇదే విధంగా ధరలు ఉంటే.. తమకు లాభం ఉంటుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ధరలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మద్దతు ధర కోసం పోరాడే రైతుకు ఎర్రబంగారం సిరులు కురిపిస్తుందని మార్కెట్ అధికారులు తెలిపారు. నాణ్యతతో ఉన్న మిర్చిని కొనుగోలు చేయడానికి ఖరీదుదారులు పోటీపడుతున్నారని చెప్పారు. ఏళ్లుగా మిర్చిని పండిస్తూనే ఉన్నప్పటికీ.. ఈ స్థాయి ధరను ఎప్పుడూ చూడలేదని మిర్చి రైతులు చెప్పుకొచ్చారు. నెల రోజుల క్రితం వరకు అకాల వర్షాలతో నట్టేట మునిగామని.. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో మిర్చి రైతుల కష్టాలు అన్నీఇన్ని కావని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో వైరస్ అటాక్‌తో ఇంకొంత పంట నాశనం అయ్యిందన్నారు. ఎప్పటికీ ఇదే స్థాయిలో ధరలు ఉంటే మిర్చి రైతులకు కన్నీరే ఉండదని స్పష్టం చేశారు. నిత్యం ఒడిదొడుకుల నడుమ నలిగే మిర్చి రైతులు ఖమ్మం మార్కెట్లో పలికిన ధరను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.