అద్దాల డ్రెస్సు అందలమెక్కించింది

పాతికేళ్ల క్రితం లంబాడా తండాల్లోని ఆడవాళ్లు సంప్రదాయ దుస్తులు ధరించేవారు. మిర్రర్​ వర్క్​తో కూడిన బట్టలు వేసుకునేవారు. ఇప్పుడు ఆ డ్రస్​ కల్చర్​ దాదాపు కనిపించట్లేదు. గిరిజన మహిళలూ అందరి లాగే రెగ్యులర్​ జాకెట్లు, శారీలు కడుతున్నారు. దీంతో తమిళనాడులోని సిట్టిలింగి లోయ ప్రాంత లంబాడా తండాల లేడీస్​కి​ ఓ ఐడియా వచ్చింది. గతంలో తమకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసి, తర్వాతి కాలంలో కనుమరుగైన ఎంబ్రాయిడరీ వర్క్​ని మళ్లీ పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారు.

ధర్మపురి జిల్లాలోని సిట్టిలింగి లోయ ప్రాంతంలో నాలుగైదు తండాలు ఉంటాయి. మిగతా జిల్లాలతో పోల్చితే ఈ జిల్లా అభివృద్ధిలో వెనకబడింది. రుతుపవనాలు రాక, వర్షాలు పడక వ్యవసాయం గాడి తప్పింది. దీంతో ఒకప్పుడు బాగానే బతికిన లంబాడా తండాల ప్రజలు ఇప్పుడు రోజువారీ పనులకోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. తిండికి, బట్టకు లోటుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో లంబాడాలు​ ఎప్పుడో మూలనపడ్డ ఎంబ్రాయిడరీ క్రాఫ్ట్​కి తిరిగి ప్రాణం పోశారు. తద్వారా వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడగలుగుతున్నారు.

సొసైటీ స్థాయికి..

ఎంబ్రాయిడరీ వర్క్​ చేసే ఆడవాళ్లంతా క్రాఫ్ట్​ అసోసియేషన్​గా ఏర్పడ్డారు. దానికి పోర్గాయ్​ అనే పేరు పెట్టారు. లంబాడా భాషలో ‘పోర్గాయ్’​ అంటే సంతోషం, గౌరవం అని అర్థం. ఈ అసోసియేషన్​ 2009లో సొసైటీగా రిజిస్టర్​ అయింది. లోయ ప్రాంతంలోని మెల్​, కీఝ్​, ఏకే, సిట్టిలింగి అనే నాలుగు తండాల్లో మొత్తం 300 కుటుంబాలు ఉంటాయి. ఆ ఫ్యామిలీస్​కి చెందిన సుమారు 60 మంది ఆడవాళ్లు పోర్గాయ్​ ఏర్పడ్డప్పటి నుంచి ఈ క్రాఫ్ట్​ను రెగ్యులర్​గా ప్రాక్టీస్​ చేస్తున్నారు.

నెలకు రూ.5 వేల ఆదాయం..

ఎంబ్రాయిడరీ పని చేసే ఆడవాళ్లు నెలకు రూ.5 వేలు సంపాదిస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు వలసలు ఆగాయి. గతంలో సిటీలకు, టౌన్లకు వెళ్లినవాళ్లు ఇప్పుడు సొంతూళ్లకు తిరిగొస్తున్నారు. సిట్టిలింగి లోయ ప్రాంతంలో పండే ఆర్గానిక్​ కాటన్​నే ఎంబ్రాయిడరీ డ్రెస్​ల తయారీకి వాడుతున్నారు. తండాల్లో కొన్న పత్తిని దిండిగల్​కి సమీపంలోని గాంధీగ్రామ్​కి పంపించి హ్యాండ్​స్పన్​, న్యాచురల్​ డైయింగ్​ చేయిస్తారు. కాటన్​కి గిరాకీ పెరగటంతో వ్యవసాయం చేయటానికి కూడా యూత్​ ముందుకొస్తున్నారు.

ఫైనాన్షియల్​, సోషల్​ బెనిఫిట్స్​…

ఎంబ్రాయిడరీ పనిని లంబాడా మహిళలు తీరిక కుదిరిన సమయాల్లోనే, ఇంట్లోనే ఉండి చేసుకుంటున్నారు. పల్లెల్లో ప్రజలు కలిసి మెలిసి ఉంటారు. ఇరుగు పొరుగు, చుట్టాలు ఒకే చోట చేరి ముచ్చట్లు పెట్టుకుంటూ పని చేసుకుంటారు. పనిలో ఎవరైనా వెనకబడితే తలో చెయ్యి వేస్తారు. అర్జెంట్​ ఆర్డర్ వచ్చినప్పుడు భాగాలుగా పంచుకొని త్వరగా పూర్తి చేస్తారు. దీంతో ఫ్యామిలీ పరంగా, సొసైటీ పరంగా అందరి మధ్యా మంచి ర్యాపో పెరుగుతోంది.

బతుకు దెరువుకి వలస వెళ్లేటప్పుడు పిల్లలను చూడాల్సిన బాధ్యతను ఇంట్లోని పెద్దోళ్లకు అప్పగించేవారు. ఇప్పుడు అలాంటి కుటుంబ సమస్యలేవీ లేవు. ఎంబ్రాయిడరీ పని చేసి సంపాదించే డబ్బును పిల్లల చదువులు, హాస్పిటల్​ ఖర్చులు, ఇంట్లో వస్తువులు సమకూర్చుకోవటానికి వాడుకుంటున్నారు. బట్టలు ఉతకటానికి పట్టే సమయం వాషింగ్​ మెషిన్లతో ఆదా అవుతోంది. ఆ టైంలో ఎంబ్రాయిడరీ వర్క్​ చేస్తున్నారు. పిల్లలను బడికి పంపించి రావటానికి స్కూటీలను ఇన్​స్టాల్​మెంట్​ పద్ధతిలో కొంటున్నారు.

ఎంబ్రాయిడరీ వర్క్​ వల్ల ఆడవాళ్లు ఆర్థికంగా బలపడుతున్నారు. వాళ్లకు జీవితంపై నమ్మకం, పని పట్ల గౌరవం పెరుగుతోంది. క్రాఫ్ట్​ ఎగ్జిబిషన్లలో స్టాల్స్​ పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కస్టమర్లు ఏం కోరుకుంటున్నారో గమనిస్తున్నారు. ఏ డిజైన్లను, ఏ కలర్స్​ని జనాలు ఇష్టపడుతున్నారో తెలుసుకుంటున్నారు. వాటికి అనుగుణంగా తమ స్కిల్స్​ పెంచుకుంటున్నారు. ఎంబ్రాయిడరీ కళతో లంబాడా మహిళల బతుకులు కళకళలాడుతున్నాయి. ఉమెన్​ ఎంపవర్​మెంట్​కి మంచి ఉదాహరణగా నిలుస్తున్నాయి.

టైలరింగ్​ యూనిట్​..

పోర్గాయ్​ సొసైటీలో మహిళలు తొలుత చిన్న ఉత్పత్తులతో మొదలుపెట్టి తర్వాత పెద్ద వస్త్రాలకు ఎంబ్రాయిడరీ చేస్తారు. హోమ్​ ఫర్నిషింగ్​లు​; పర్సులు, వాలెట్లు, బ్యాగులు తదితర యాక్సెసరీలనూ రూపొందిస్తారు. ప్రొడక్షన్ పెద్దఎత్తున జరగటానికి టైలరింగ్​ యూనిట్​ని ఏర్పాటుచేశారు. ఇక్కడ తయారయ్యే వస్తువులను అమ్మటానికి మొదట్లో చిన్న సంతలకు, తిరునాళ్లకు మాత్రమే వెళ్లేవారు. ఇప్పుడు వివిధ దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే క్రాఫ్ట్​ ఎగ్జిబిషన్లలో పాల్గొంటున్నారు.

అమ్మమ్మలు, నానమ్మలే టీచర్లు…

సిట్టిలింగి వ్యాలీ ఏరియాలో ట్రైబల్​ హెల్త్​ ఇనీషియేటివ్​ (టీహెచ్​ఐ) సంస్థ గిరిజనులకు హెల్త్​కేర్ సర్వీసుల​​తో పాటు ఓవరాల్​ డెవలప్​మెంట్​కి చేయూతనిస్తోంది. ఇందులో భాగంగా రూరల్​ హాస్పిటల్ ఏర్పాటు చేసింది. ‘క్రాఫ్ట్ ఇనీషియేటివ్​’ అనే ప్రోగ్రామ్‌‌ని ప్రారంభించింది. గిరిజన తండాల్లో ఎంబ్రాయిడరీ పని వచ్చినవాళ్లు కొద్దిమందే ఉన్నారు. వాళ్లంతా వయసు మీద పడ్డోళ్లే. వాళ్లు ఈ వర్క్​ని తమ పెద్దల నుంచి నేర్చుకున్నారు. ఇప్పుడు ఆ విద్యను తమ పిల్లలకు, మనవరాళ్లకు, యువతులకు నేర్పుతున్నారు.  ఎంబ్రాయిడరీ క్రాఫ్ట్​ని నిలబెట్టే ప్రయత్నం 2006లో మొదలైంది. ఈ పని నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న ఆడ పిల్లలకు 10 రోజుల ట్రైనింగ్​ ఉంటుంది. ముందుగా చిన్న పీస్​ల మీద అల్లికలు వేయిస్తారు.​ వర్క్​ పర్​ఫెక్ట్ అయ్యాక గార్మెంట్లపై ఎంబ్రాయిడరీ బాధ్యత అప్పగిస్తారు.​ ట్రైనింగ్​ లేదా రిఫ్రెషర్​ సెషన్స్​ను అవసరాన్ని బట్టి నిర్వహిస్తారు. ఈ పనిని ఇక్కడి లంబాడాలు చేసినంత ప్రొఫెషనల్​​గా వేరేవాళ్లు చేయరంటే అతిశయోక్తి కాదు. ఆ స్కిల్ చూసి కస్టమర్లు ఆశ్చర్యపోతుంటారు. ‘మెషిన్​తో చేసిన ఎంబ్రాయిడరీనా’ అని అడుగుతుంటారు.

– ‘ది వైర్​’ సౌజన్యంతో…