బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకుందాం : మిర్యాల రాజిరెడ్డి

బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకుందాం :  మిర్యాల రాజిరెడ్డి

గోదావరిఖని, వెలుగు : బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకొని సింగరేణి సంస్థను కాపాడుకుందామని బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గోదావరిఖనిలోని టీబీజీకేఎస్‌‌ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్‌‌మీట్‌‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకులు సింగరేణికి కాకుండా ప్రైవేట్‌‌ వ్యక్తులకు దక్కితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కార్మికుల శ్రమను దోచుకుని కాంట్రాక్టర్లు బాగుపడతారు తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఇటీవలి కాలంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన 20 వేల మంది కార్మికుల భవిష్యత్‌‌ కూడా గందరగోళంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

బొగ్గు బ్లాకులను సింగరేణికే అప్పగించేలా పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. కార్మిక సంఘాలతో జేఏసీని ఏర్పాటు చేసి బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా పోరాడుతాం అని ప్రకటించారు. బొగ్గు బ్లాకులను సింగరేణికే ఇచ్చేలా కేంద్ర బొగ్గు గనులు, ఖనిజాల శాఖ మంత్రి జి.కిషన్‌‌రెడ్డిని సైతం కలుస్తామని చెప్పారు. నాయకులు నూనె కొమురయ్య, మాదాసి రామమూర్తి, పర్లపల్లి రవి, కె.సురేందర్‌‌రెడ్డి, పెట్టం లక్ష్మణ్, పల్లె సురేందర్, పులిపాక శంకర్, చంద్రయ్య పాల్గొన్నారు.