పథకాలు అడిగితే మహిళను బండ బూతులు తిట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

ప్రభుత్వ పథకాలు అడిగితే ఓ మహిళను బూతులు తిట్టాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. తాను అర్హురాలిని అయినా కూడా గృహలక్ష్మీలో తన పేరు ఎందుకు లేదని ఎమ్మెల్యేను నిలదీసినందుకు అమ్మనా బూతులు తిట్టాడు. దాన్ని(మహిళ) ఇక్కడి నుంచి నెట్టేయండి అంటూ.. నోటికొచ్చిన పచ్చి బూతులతో మహిళపై రెచ్చిపోయాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే  నల్లమోతు భాస్కర రావు.. వేములపల్లి మండలలోని శెట్టిపాలెంలో పర్యటించారు. అక్కడ గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను ..స్థానిక మహిళ ప్రశ్నించింది.  ప్రభుత్వ పథకాల్లో అర్హుల పేర్లను తీసేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

పేదలకు కాకుండా అనర్హులకు పథకాలు అమలుచేస్తున్నారంటూ ఎమ్మెల్యేను నిలదీసింది.  గృహలక్ష్మీ పథకానికి తాను అర్హురాలిని అయినా కూడా తన పేరును కావాలనే తీసేశారని మండిపడింది.  దీంతో సదరు మహిళను  ఎమ్మెల్యే భాస్కర్ రావు పచ్చి బూతులు తిట్టాడు. దాన్ని (మహిళ) సభ నుంచి గెంటేయమని బీఆర్ఎస్ కార్యకర్తలను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అడిగితే ఇలా బూతులు తిట్టడం ఏంటని బాధిత మహిళతో పాటు..గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALSO READ: నడిరోడ్డుపై యుద్ధం : పోలీసును చెప్పుతో కొట్టిన మహిళ.. ఆమెను కాలితో తన్నిన పోలీస్

ఎమ్మెల్యే బూతులు..

హౌలా దాన, పనికిమాలిన దాన, నీకు ఇళ్లు ఇవ్వను పో.. ఏం చేసుకుంటావో చేసుకో.. అంటూ మహిళ పై అందరి ముందే పచ్చి బూతులు తిట్టాడు. ప్రభుత్వ పథకాలు అడిగితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ .. మహిళను ఎమ్మెల్యే భాస్కర రావు బండ బూతులు తిట్టాడు. దీంతో ఆ మహిళ బోరున ఏడుస్తూ.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. గతంలోనూ పలుమార్లు ప్రజలపై ఇలాగే ఎమ్మెల్యే భాస్కర్ రావు నోరు పారేసుకున్నారు.