మిర్యాలగూడ ఎమ్మెల్యే వినూత్న క్యాంపెయినింగ్

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్​రావు వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 2014 నుంచి 2023 వరకు మిర్యాలగూడ నియోజవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రత్యేకంగా పుస్తకాలు, పాంఫ్లెట్లు ముద్రించి ప్రచారం చేస్తున్నారు. దీంతోపాటు ఈ పదేండ్ల కాలంలో ప్రతి గ్రామానికి ఎన్ని నిధులు వచ్చాయి? ఎంత ఖర్చు పెట్టాం? కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​, రైతుబంధు, దళితబంధు, ఆసరా ఫించన్లు, మిషన్​ భగీరథ, డబుల్​ బెడ్రూం ఇండ్లు, గృహలక్ష్మి, కుట్టుమెషీన్లు,  మరుగుదొడ్లు, పల్లె ప్రకృతి వనాలు, రైతు రుణ మాఫీ, బతుకమ్మ చీరలు, అంబేద్కర్​ విద్యానిధి.. ఇలా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి స్కీం కింద ఎంత మంది లబ్ధి పొందారు? అనే వివరాలను పొందుపరుస్తూ  పాంప్లెట్లు తయారుచేసి ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. 

2014 నుంచి 2023 వరకు మొత్తం రూ.5,485 కోట్లు ఖర్చుపెట్టినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. అలాగే 2014కు పూర్వం మిర్యాలగూడ నియోజకవర్గం ఎట్లా ఉండేది? ఇప్పుడు ఎట్లా ఉంది? అన్న విషయాలు   తెలిపేందుకు ‘నాడు-నేడు’ టైటిల్ తో ఫొటోలు ముద్రించారు. 24 పేజీలతో ఈ పుస్తకాన్ని తయారు చేయించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్  రెడ్డి, గుత్తా సుఖేందర్​ రెడ్డి  ప్రారంభించిన..శంకుస్థాపన చేసిన పనుల వివరాలను అందులో పేర్కొన్నారు.