మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర కోటేశ్వరరావు అలియాస్ విష్ణు (52) మంగళవారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు. స్థానిక బంగారు గడ్డలో నివాసం ఉంటున్న ఆయన కు జ్వరం వచ్చింది. దీనికి తోడు హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే ఆయనను మిర్యాలగూడ పట్టణంలోని బాలాజీ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆయన చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు బంగారుగడ్డ కు చేరుకొని విష్ణు భౌతికకాయం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు.
విష్ణు మృతి చెందిన విషయం తెలుసుకున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయ సింహా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, కౌన్సిలర్లు బుధవారం బంగారు గడ్డకు వచ్చి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. విష్ణు అంత్యక్రియలను గురువారం నిర్వహిస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.