- 2 సెల్ఫోన్లు, కారు, నగదు సీజ్
నల్గొండ అర్బన్, వెలుగు: పార్కింగ్ చేసిన వాహనాలే టార్గెట్గా అద్దాలు పగల గొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2 . 77 లక్షల నగదు, రెండు సెల్ ఫోన్లు, ఒక ఎర్టిగా కారు తో పాటు సుమారు రూ. 4లక్షల విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు వివరాలను వెల్లడించారు.
ఏపీలోని నెల్లూరు జిల్లా భోగోల్ మండలం కప్రాలతిప్ప గ్రామానికి చెందిన పిట్ల మహేశ్, ఆవుల రాకేశ్ మరి కొంత మందితో కలిసి ముఠాగా ఏర్పడ్డారని, పార్కింగ్ చేసిన కార్ల అద్దాలను పగలగొట్టి కారులో ఉన్న నగదు, నగలు, ఇతర విలువైన వస్తువులు దొంగలించేవారని చెప్పారు. జనవరి 30న మధ్యాహ్నం పెద్దవూర మండలం చిన్నగుడెం గ్రామానికి చెందిన రావుల శంకర్ గొర్రె పిల్లలను మిర్యాలగూడ అవంతిపురం సంతలో అమ్మాడని, రూ.97 వేలు తువాల్లో చుట్టి టాటా ఏస్ క్యాబిన్ డిక్కీలో పెట్టాడని తెలిపారు.
సొంతఊరికి తిరిగివెళ్తూ ఎఫ్సీఐ దగ్గర వెహికల్ ఆపి హోటల్ కెళ్లి వచ్చేలోపు గ్లాస్ ను పగలగొట్టి డిక్కీలో ఉన్న నగదును దొంగలించారని తెలిపారు. బాదలాపురం బస్ స్టేజ్ వద్ద కోదాడ, జడ్చర్ల హైవేపై గురువారం వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు ఎర్టిగా కారులో అద్దాలను పగలగొట్టేందుకు వాడే పనిముట్లు గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరిని విచారించగా శంకర్ టాటాఎస్ నుంచి నగదు చోరీతో పాటు మిర్యాలగూడలో రెండు చోట్ల దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారని తెలిపారు.
మూడు చోరీల్లో దొంగిలించిన రూ.2,77,000 నగదు, రెండు సెల్ ఫోన్లు, ఒక ఎర్టిగా కారు స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్ కు తరలించినట్టు చెప్పారు. నిందితులను పట్టుకున్న మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు, రూరల్ ఎస్ఐ సతీశ్, సీసీఎస్ హెచ్సీ వీవీ గిరి, కానిస్టేబుళ్లు ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్, సైదులును డీఎస్పీ అభినందించారు.