నిజామాబాద్​ జిల్లా బీజేపీ ఇన్​చార్జి  వెహికల్​ అద్దాలు ధ్వంసం

  •     భయపడేది లేదన్న మీసాల చంద్రయ్య  

నిజామాబాద్ రూరల్, వెలుగు : బీజేపీ సీనియర్​లీడర్,​ నిజామాబాద్ జిల్లా ఇన్​చార్జి మీసాల చంద్రయ్య వాహనంపై రాళ్ల దాడి జరిగింది. శుక్రవారం నగరంలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న చంద్రయ్య తన వాహనంలో హైదరాబాద్​కు తిరుగు ప్రయాణమయ్యారు. శివారులోని మాధవనగర్​వద్ద రైల్వే గేటు పడడంతో సాయిబాబా ఆలయం పక్కన వాహనాన్ని ఆపారు. అదే టైంలో వెనక వైపు నుంచి బైక్​పై వచ్చిన ఇద్దరు యువకులు రాళ్లతో చంద్రయ్య వాహనంపై దాడి చేసి పరారయ్యారు. వెనక అద్దాలు పూర్తిగా ధ్వంసం కాగా వెహికల్ ​లోపల ఉన్న చంద్రయ్య సురక్షితంగా బయటపడ్డారు. డిచ్​పల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ తన వాహనాన్ని వెంబడిస్తూ వచ్చిన బీఆర్ఎస్​గుండాలే ఈ దాడి చేశారని ఆరోపించారు. రాళ్లతో దాడి చేసిన యువకులు ‘కవిత జిందాబాద్, బీఆర్ఎస్​ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తూ  పరారయ్యారన్నారు. తాటాకు చప్పుళ్లకు తాము భయపడేది లేదన్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వలక్ష్మీనర్సయ్య, నాయకుల రాజశేఖర్​రెడ్డి, ప్రమోద్​, రాజు, లచ్చన్న ​ దాడిని ఖండించారు.