సూర్యాపేట జీపీల్లో నిధుల దుర్వినియోగం!.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న అక్రమాలు

  •     వ్యవహారాన్ని సీరియస్‌‌గా తీసుకున్న కలెక్టర్
  •     ఇద్దరు సర్పంచుల చెక్‌‌ పవర్ రద్దు, సెక్రటరీల సస్పెన్షన్
  •     మరో మూడు పంచాయతీలపైనా విచారణ

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలోని పలు గ్రామపంచాయతీల్లో నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. వార్డుమెంబర్ల ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేస్తుండడంతో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.  పల్లెప్రగతి, ఉపాధి హామీ పనుల్లో ఎంపీ రికార్డులు లేకుండానే డబ్బులు డ్రా చేయడం, చేయని పనులకు బిల్లులు తీసుకోవడం లాంటి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇప్పటికే మేళ్లచెర్వు, మట్టపల్లి జీపీల్లో రికార్డులు స్వాధీనం చేసుకున్న అధికారులు.. కలెక్టర్‌‌కు నివేదించారు. పరిశీలించిన ఆయన సర్పంచుల చెక్‌‌ పవర్‌‌‌‌ రద్దు చేయడంతో పాటు సెక్రటరీలను సస్పెండ్ చేశారు. దోచుకున్న సొమ్మును రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రికవరీ చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. 

మేళ్లచెర్వులో రూ.2 కోట్లు గోల్‌‌మాల్

మండల కేంద్రమైన మేళ్లచెర్వు గ్రామ పంచాయతీలో రూ.2 కోట్లు దుర్వినియోగం అయినట్లు వార్డుమెంబర్లు కలెక్టర్‌‌‌‌కు  ఫిర్యాదు చేశారు.  స్పందించిన  కలెక్టర్ ఎంక్వైరీ చేయాలని ఆర్డీవోను ఆదేశించారు.  దీంతో కోదాడ ఆర్డీవో తన బృందం ఈ నెల 5న మేళ్లచెరువు జీపీలో తనిఖీలు చేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా జీపీ బిల్డింగ్ నిర్మాణం, పల్లె ప్రగతి పనులు, పల్లె ప్రకృతి వనం, మొక్కల ఖర్చు, ఉపాధి హామీ పనుల్లో దాదాపు రూ.2 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు.

కలెక్టర్‌‌‌‌కు రిపోర్ట్ ఇవ్వడంతో  ఆయన సర్పంచ్ పందిళ్లపల్లి శంకర్‌‌‌‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాదు 45 రోజుల్లో రూ.2 కోట్లు రికవరీ చేయాలని  తహసీల్దార్‌‌‌‌ను ఆదేశించడంతో పాటు ఇక్కడ పనిచేసి బదిలీ అయిన కార్యదర్శిని సస్పెండ్ చేశారు. వీటితో పాటు జీపీలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ పేరుతో డ్రా చేసిన రూ.18 లక్షల నిధులకు లెక్కలు తేలాల్సి ఉంది.  

మట్టపల్లి జీపీల్లో రూ.74 లక్షలు డ్రా 

మఠంపల్లి మండలం మట్టపల్లి జీపీలో నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణలు రావడంతో  హుజూర్ నగర్ ఆర్డీవో ఈనెల 5న గ్రామపంచాయతీ రికార్డులు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. ఎలాంటి ఎంబీ రికార్డులు లేకుండా  49 చెక్కుల ద్వారా రూ. 74.84 లక్షలు డ్రా చేశారని గుర్తించి.. కలెక్టర్‌‌‌‌కు నివేదించారు. దీంతో ఆయన నిధులను రికవరీ చేయాలని మఠంపల్లి తహసీల్దార్‌‌‌‌ను ఆదేశించారు. బిల్లులు సమర్పించని వాటిపై సర్పంచ్‌‌కు షోకాజ్‌‌ నోటీస్ ఇవ్వడంతో పాటు రెండు రోజుల కింద చెక్ పవర్ రద్దు చేస్తూ  ఉత్తర్వులు జారీ చేశారు.  అప్పుడు పని చేసిన గ్రామ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేశారు. 

మరికొన్ని జీపీల్లోనూ...

జిల్లాలో మరికొన్ని గ్రామ పంచాయతీల్లోనూ అక్రమాలు జరిగాయని వార్డుమెంబర్లు ఆరోపిస్తున్నారు.  ఈ మేరకు కలెక్టర్‌‌‌‌కు ఫిర్యాదు చేస్తున్నారు. రెండు రోజుల కింద మఠంపల్లి మండలం బిల్యా నాయక్ తండా జీపీలో అవకతవకలు జరిగాయని  ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కోదాడ డివిజనల్ డీఎల్‌‌పీవో శ్రీరాములు జీపీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇదే మండలానికి చెందిన పెదవీడు పంచాయతీలో రూ.2కోట్లు దుర్వినియోగం చేశారని  ఎంపీటీసీ వెంకట్‌‌రెడ్డి, వార్డ్ మెంబర్లతో కలిసి  అడిషనల్ కలెక్టర్‌‌‌‌కు కు ఫిర్యాదు చేశారు.