వరల్డ్ కప్ 2023 టోర్నీని బహిష్కరించాలని పాకిస్తాన్ చూస్తుంటే.. ఆడాల్సిందేనని ఆదేశ మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు. ఆధిపత్య పోరుకు పోయి కోట్లాది మంది అభిమానులను నిరాశపరచకండని ఆదేశ క్రికెట్ బోర్డు పీసీబీకి బుద్ధి చెప్తున్నారు. రెండ్రోజుల క్రితం పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది ఇదే విషయాన్ని ప్రస్తావించగా, తాజాగా ఆ జట్టు మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్ సైతం అదే సూచించారు.
ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొనడం ప్రభుత్వ అనుమతికి లోబడి ఉంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయమై పాక్ ప్రధాని షహనాజ్ షరీఫ్.. ఓ అత్యున్నత కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే పాక్ జట్టును.. భారత్ కు పంపాలా? వద్దా? అన్న దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ విషయంపై మాట్లాడిన మిస్బా-ఉల్-హక్.. పాక్ జట్టును వరల్డ్ కప్ టోర్నీకి పంపకపోతే కోట్లాది మంది అభిమానులు నిరాశ చెందుతారని తెలిపాడు. ఇతర క్రీడలలో పోటీ పడుతున్నప్పుడు లేని పట్టింపులు.. క్రికెట్‌కు ఎందుకు అడ్డంకిగా మారుతున్నాయని అతడు ప్రశ్నించాడు. భారత జట్టు కూడా మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్థాన్‌కు రావాలని మిస్బా తెలిపాడు.
"ఇతర క్రీడలలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడు, క్రికెట్‌లో ఎందుకు ఉండకూడదు? క్రికెట్‌ను రాజకీయ సంబంధాలతో ఎందుకు ముడిపెట్టాలి? ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఈ మ్యాచ్ జరిగితే చూడాలని కొన్ని కోట్ల మంది క్రికెట్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తుంటారు. వారిని నిరాశ పరచటం కరెక్ట్ కాదు. పాకిస్తాన్, ఖచ్ఛితంగా ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడి తీరాలి. అలాగే భారత జట్టు కూడా మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్థాన్‌కు రావాలి."
"ఇంతకుముందు మేము చాలా సార్లు ఇండియాలో పర్యటించాం.. ఎన్నో మ్యాచులు ఆడాం. ఆ సత్తా మన జట్టుకే ఉంది. ఆ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా బాగుంటుంది. ప్రతి క్రికెటర్, ప్రతి అభిమాని దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇండియాలో మ్యాచ్‌లు ఆడితే మరింత కసిగా ఆడాలనే పట్టుదల పెరుగుతుంది. దయచేసి క్రికెట్‌కి సంబంధం లేని విషయాలను ఆటలోకి తీసుకురావద్దు..' అని మిస్బా వుల్ హక్ స్పష్టం చేశాడు.
కాగా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్‌లో ఆసియా కప్ మ్యాచ్‌లు ఆడేందుకు బీసీసీఐ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ వివాదమే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇండియా - పాక్ మ్యాచుకు అడ్డుపడుతోంది.