- నిందితుల్లో ఒకరు మైనర్.. రెండుసెల్ ఫోన్లు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
జగిత్యాల, వెలుగు : గంజాయిని ఎరగా చూపి బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో ముగ్గురి పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. టెన్త్ మధ్యలో చదువు మానేసి ఇంటి వద్ద ఉంటున్న బాలికకు 2018–-19లో ప్రేమ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని అతడు ప్రేమ పేరిట బాలికను నమ్మించాడు. ఆమెతో గంజాయి తాగించి, బలవంతంగా అత్యాచారానికి పాల్పడేవాడు. ఏడాది తర్వాత ప్రేమ్ ఆ బాలికను దూరం పెట్టగా.. ఈ క్రమంలోనే మెట్ పల్లి ప్రాంతానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరిట లొంగదీసుకున్నాడు. బాలికకు గంజాయి తాగించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. వెంకటేశ్ దూరమయ్యాక ఓ బాలుడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. అతడికి కూడా అప్పటికే గంజాయి తీసుకునే అలవాటు ఉంది. ఆ బాలుడు కూడా గంజాయిని ఎరగా చూపి బాలికను లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తండ్రి అనుమానంతో ఆరా తీశాడు. మత్తు మందుకు బానిసైన బాలిక మానసిక ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేదని గుర్తించారు. డీ అడిక్షన్ సెంటర్ లో చేర్పించి, ట్రీట్ మెంట్ చేయించారు. అక్కడి నుంచి ఆమెను సేఫ్ హోంకు తరలించారు. తల్లిదండ్రులు, సీడబ్య్లూసీ అధికారులు, డీ అడిక్షన్ సెంటర్ నిర్వాహకుల వాంగ్మూలం మేరకు నిందితులు బాలికకు బలవంతంగా మత్తు పదార్థాలు ఇచ్చి, వివిధ ప్రదేశాల్లో, వేర్వేరు సమయాల్లో లైంగికంగా వేధించినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 23న పోక్సో కేసుతో పాటు ఎన్డీపీఎస్ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచినట్టు చెప్పారు. గతంలో సుప్రీంకోర్టు సూచించిన మేరకు కేసు సున్నితత్వం దృష్ట్యా బాధితురాలైన బాలిక, నిందితుల్లో మైనర్ పేర్లు బయటపెట్టడం లేదని, వీరి సమాచారాన్ని ఎవరైనా బహిరంగపరిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.