- కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
కాగజ్ నగర్ ,వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు జడ్పీటీసీ పంద్రం పుష్పలత నూతనంగా నిర్మించుకున్న ఇంటికి దుండగులు గురువారం రాత్రి నిప్పంటించారు. ఆమె కథనం ప్రకారం.. బెజ్జూరు మండలం సోమిని గ్రామంలో పుష్పలత ఇటీవలే నూతనంగా ఇల్లు నిర్మించుకున్నారు. ఆ ఇంట్లో పత్తి పంటను నిలువ పెట్టగా గుర్తుతెలియని దుండగులు ఎవరూలేని సమయంలో ఆ ఇంటికి నిప్పంటించారు.
మంటలు చెలరేగడంతో పొరుగువారు బిందెలతో మంటలు ఆర్పారు. మంటల్లో తలుపు, రెండు క్వింటాళ్ల పత్తి కాలిపోయింది. రూ.20 వేల ఆస్తినష్టం జరిగిందని జడ్పీటీసీ పుష్పలత తెలిపారు. తన ఇంటికి నిప్పంటించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని ఎస్సై విక్రమ్ సందర్శించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.