ఐదు విద్యా సంవత్సరాల వ్యవధిలో అధ్యా పకుల సంఖ్యను తగ్గించడం వల్ల విద్యా ర్థి -ఉపాధ్యాయుల మధ్య సమతుల్యత తగ్గిపోయింది. రాష్ట్ర విద్యా బడ్జెట్ను గమనిస్తే ప్రతి ఏడాది రాష్ట్రపభ్రుత్వం విద్యకు కేటాయించే నిధులు తగ్గుతున్నాయి. 2014- –15 ఆర్థిక సంవత్సరంలో విద్యకు రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం10.89% నిధులు కేటాయిస్తే, 2022–-23 లో 6.24 శాతానికి తగ్గించింది. దీన్ని బట్టి మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏ మాత్రం విద్యను పటిష్టం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు . కొన్ని నెలలుగా ప్రభుత్వ నిర్వహణలోని సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కారణంగా అణగారిన వర్గాల పేద విద్యా ర్థులు తీవ్ర అనారోగ్యా నికి గురయ్యారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ముఖ్యమంత్రి గత అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థుల వసతి గృహాల్లో భోజన నాణ్యత సమస్యను గుర్తించినప్పటికీ ఈ సమస్య పరిష్కారానికి ఏ తక్షణ నివారణ చర్యలు తీసుకోలేదు. కనీసం విద్యా శాఖ మంత్రి కూడా విద్యా వ్యవస్థ, హాస్టళ్ల పరిస్థితి మీద సమీక్ష చేయలేదు. బడులు మొదలై నెలులు గడిచినా, బుక్స్, యూనిఫామ్ పూర్తి స్థాయిలో అందలేదు. ఏ ప్రభుత్వ బడిలో పూర్తి స్థాయిలో టీచర్లు లేరు. తాగునీరు, పారిశుద్ధ్యం లాంటి వాటి మీద ప్రభుత్వానికి పట్టింపే లేదు. విద్య మెరుగ్గా ఉంటేనే రేపటి బంగారు తెలంగాణ ఏమో కానీ, కనీసం భవిష్యత్తు ఉన్న తెలంగాణను నిర్మించగలం. ఉన్నత విద్యపై కూడా ప్రభుత్వానికి పట్టింపు లేదు. సర్కారు వర్సిటీల్లో సమస్యలు రాజ్యమేలుతుండగా, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వడం చూస్తుంటే ప్రభుత్వ ప్రాధాన్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో కనీసం 80 శాతం ఉన్న అణగారిన వర్గాల ఉన్నత విద్య ఆశయాలను సమాధిచేసే దిశగా సర్కారు అడుగులు పడుతున్నాయి. రాష్ట్రానికి ఆ అవార్డు వచ్చింది, ఈ అవార్డు వచ్చిందని ట్విట్టర్ భజనలు ఆపి దారితప్పిన రాష్ట్ర ఉన్నత విద్య పరిస్థితిని దారిలో పెట్టడంపై దృష్టి పెట్టాలి.
- అశోక్ ధనావత్,
ఏరాస్మష్ యూనివర్సిటీ, నెథర్లాండ్స్