సింగరేణి థర్మల్​ ​పవర్ ​ప్లాంట్​లో గాడి తప్పిన పాలన

  • విజిలెన్స్​ విభాగం తీరుతో ఉద్యోగులపై పెరిగిన ఒత్తిడి
  • విచారణ పేరిట వేధిస్తున్నారన్న ఆరోపణలు   
  • రెండు రోజుల కింద ఇంజినీర్​ఆత్మహత్య
  • సూసైడ్​ నోట్​లో బాధ్యుల పేర్లు 
  • విజిలెన్స్ శాఖ తీరుపై విమర్శలు

కోల్​బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్​లోని సింగరేణి థర్మల్​పవర్​ప్లాంట్​(ఎస్టీపీపీ) నిర్వహణ గాడి తప్పిందనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు అధికారుల వ్యవహార శైలి కారణంగా ఉద్యోగులపై ఒత్తిళ్లు, వేధింపులు, ఎంక్వైరీలు పెరిగాయంటున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల కింద డిప్యూటీ సూపరింటెండెంట్​ఆఫ్​ ఇంజినీర్ ​కిరీటి  ఆత్మహత్య చేసుకోగా..పనిఒత్తిడి, విజిలెన్స్ ​ఆఫీసర్లు ఎంక్వైరీ పేరుతో వేధించడం వల్లే చనిపోతున్నట్టు సూసైడ్ నోట్​లో రాశాడు. ఇందులో ఒకరిద్దరు ఉన్నతాధికారులతో పాటు అవుట్​సోర్సింగ్​ ద్వారా వచ్చిన రిటైర్డ్​ఆఫీసర్ ​ప్రస్తావన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

సూసైడ్​ నోట్​లోని అంశాలను పోలీసులు బయటపెట్టకపోవడంతో ఆఫీసర్లను రక్షించడానికే ఇదంతా చేస్తున్నారని మిగతా ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కిరీటి సిన్సియర్​గా పని చేసేవాడని, తమతో , కిందిస్థాయి ఉద్యోగులతో కలిసిమెలిసి ఉండేవాడని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం సింగరేణి వ్యాప్తంగా అధికారులు ఆందోళనకు దిగారు. కొందరు విజిలెన్స్​అధికారులు ఏండ్ల తరబడి ఒకే చోట తిష్టవేసి విచారణ పేరుతో అధికారులు

ఉద్యోగులను ఇబ్బందులు పెడతున్నారని, విజిలెన్స్​ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల ఆఫీసర్లు సీఎండీ బలరాంనాయక్​కు వినతిపత్రాలు పంపించారు. మరోవైపు కోట్లు మింగిన అక్రమార్కులను విడిచిపెట్టి తప్పుచేయని వారిని విజిలెన్స్​ అధికారులు వేధిస్తూ, బెదిరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని హెచ్ఎంఎస్​ నేత రియాజ్​అహ్మద్​ డిమాండ్​ చేశారు.  

పై అధికారులను బాధ్యులను చేయకుండా...

సింగరేణిలో ఎక్కడ అక్రమాలు, అవినీతి జరిగినా పసిగట్టి వాటిని నియంత్రించడమే సింగరేణి విజిలెన్స్​ విభాగం పని. అయితే, ఆచరణలో మాత్రం ఇది కానరావడంలేదు. సిన్సియర్​గా పనిచేసే అధికారులు, కార్మికులను ఎంక్వైరీ పేరుతో వేధిస్తున్నారని కిరీటి సూసైడ్ ​నోట్​తో బయటపడింది. ఎస్టీపీపీ నిర్వహణలో భాగంగా రూ.కోట్ల విలువైన సామగ్రిని స్టోర్స్​లో భద్రపరుస్తారు. వీటిని వివిధ విభాగాలకు ఇస్తుంటారు. వారు ఉపయోగించుకోకపోతే తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, కొన్ని డిపార్ట్ మెంట్స్​నుంచి కొంత సామగ్రి తిరిగి రాలేదు.

దీంతో విజిలెన్స్​ఆఫీసర్లు ఎంక్వైరీ మొదలుపెట్టారు. సామగ్రి ఎవరు తీసుకువెళ్లారు? ఎప్పుడెప్పుడు తీసుకువెళ్లారు? వేటికి ఉపయోగించారు? మిగిలినవి ఎప్పుడు తిరిగిచ్చారు? ఇవ్వకపోవడానికి కారణాలేమిటి? అనే విషయం తెలుసుకునేందుకు మే 3వ తేదీన విచారణ మొదలుపెట్టారు. అన్ని వివరాలు తమకు అందజేయాలని, ఇన్​చార్జీలు తమ దగ్గరున్న సామగ్రిని తిరిగి ఇవ్వాలని కోరారు. డిప్యూటీ సూపరింటెండెంట్​ఆఫ్​ఇంజినీర్​ కిరీటి బ్రాయిలర్​ అండ్​టర్బైన్​ డిపార్ట్​మెంట్​కు ఇన్​చార్జీగా ఉన్నారు. ఈయన కొన్ని పరికరాలు తీసుకున్నా తిరిగివ్వలేదు. కిరీటి పైన ఇద్దరు అధికారులు ఉన్నా

వారిని అడగకుండా కిరీటిని  సామగ్రి ఏమైందని, తిరిగి ఇవ్వాలని వేధించడం మొదలుపెట్టారు. సామగ్రి మిస్​యూజ్ ​కాకపోయినా వారిచ్చిన గడువులోగా ఎక్కడుందో చెప్పడమెలా అని సతమతమయ్యాడు. మరింత ఒత్తిడి పెంచడంతో ఆందోళన చెందాడు. తన ఉద్యోగం ఎక్కడ పోతుందోనని భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రోజూ బొగ్గు అక్రమ రవాణా, తుక్కు, ఇనుము దొంగతనాలు, మెడికల్​అన్​ఫిట్​పైరవీల్లో కోట్లు మారుతుంటే వారిని గుర్తించి శిక్షించకుండా.. సంస్థలోని అమాయకులపై విచారణ పేరిట విజిలెన్స్ ​విభాగం వేధిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.

ఇసుక, బొగ్గు రవాణా, లోడింగ్, అన్​లోడింగ్ ​ప్రాంతాలకు వాహనాల కేటాయింపు తదితర విషయాల్లో సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కార్మికులు చిన్న తప్పు చేసినా, అలసి నిద్రపోతున్నా, ఆకాశ రామన్న ఉత్తరం రాసినా దాడులు, చర్యలు అంటూ హడావుడి చేస్తున్నారని అంటున్నారు.  

పర్యవేక్షణకే పరిమితమైన సింగరేణి

ఎస్టీపీపీ నిర్మాణం నుంచి కరెంట్ ​ఉత్పత్తి వరకు అన్ని పనులు ప్రైవేటు కంపెనీకి అప్పగించిన సింగరేణి పర్యవేక్షణకే పరిమితమైంది. దీంతో ప్లాంట్​ నిర్వహణ సరిగ్గా లేదని తెలుస్తోంది. గతంలో పాలన పూర్తిగా ఇద్దరు రిటైర్డు ఆఫీసర్ల చేతిలో ఉండేది, కాంగ్రెస్ ​సర్కార్ ​వచ్చాక ఒకరిని విధుల నుంచి తప్పించింది. దీంతో ప్రస్తుతమున్న ఆఫీసర్​ ఉద్యోగులు, అధికారులపై పెత్తనం చెలాయించేందుకే ఉన్నారని, సంస్థను పట్టించుకోవడం లేదని కొందరు ఉద్యోగులంటున్నారు. సింగరేణిలో కీలక అధికారి సెలవు పెడితే సదరు రిటైర్డు ఆఫీసర్​కే పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నారంటున్నారు.

ఒక పబ్లిక్​ రంగ సంస్థ బాధ్యతలు అవుట్​సోర్సింగ్​ ఉద్యోగికి ఇవ్వడం ఏమిటని విమర్శిస్తున్నారు. సింగరేణిలో చెందిన సీనియర్​ ఆఫీసర్లు, ఇంజినీర్లు, టెక్నీషియన్లు, స్కిల్డ్​ ఎంప్లాయీస్​ ఉన్నా బాధ్యతలు అప్పగించడం లేదంటున్నారు. అవగాహన లోపంతో పవర్​ జనరేషన్​ ట్రిప్​తో ఎస్టీపీపీకి రూ.70 లక్షల వరకు నష్టం జరిగినా సదరు రిటైర్డు ఆఫీసర్​ మ్యానేజ్​ చేసినట్లు ఆరోపణలున్నాయి. 

అమాయకులను వేధించేందుకే..

సింగరేణి విజిలెన్స్ విభాగం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. అమాయకులైన కార్మికులు, కింది స్థాయి ఆఫీసర్లను వేధించడమే ఈ విభాగం పనిగా పెట్టుకుంది. ఆర్థికపరమైన లావాదేవీలు, కొనుగోళ్లు, టెండర్లు, కాంట్రాక్టులు, నాణ్యత వంటి అంశాలపై దృష్టిపెట్టకుండా సంస్థ కోసం సిన్సియర్​గా పనిచేసే వారే లక్ష్యంగా ఎంక్వైరీ పేరుతో వేధిస్తోంది. విజిలెన్స్ ఆఫీసర్ల వేధింపులతోనే ఇంజినీర్ ​కిరీటి సూసైడ్​ చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యకు కారణమైనవారిపై యాజమాన్యం చర్యలు తీసుకోవాలె

 - మళ్లికార్జున్​, కార్మిక నేత