
- 10న ఓపెనింగ్ సెర్మనీ, 31న ఫైనల్.. 25 రోజుల పాటు 22 ఈవెంట్లు
- హాజరుకానున్న 140 దేశాల కంటెస్టెంట్లు
- మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ విశ్వవ్యాప్తం: మంత్రి జూపల్లి
- వీటిపై రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి
- మిస్ వరల్డ్ ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా
హైదరాబాద్, వెలుగు: 72వ మిస్‌వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. మే 7 నుంచి 31 దాకా హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. 25 రోజుల పాటు 22 ఈవెంట్లు నిర్వహించనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి 140 దేశాలకు చెందిన కంటెస్టెంట్లతో పాటు ఆయా దేశాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, కళాకారులు.. ఇలా విభిన్న రంగాలకు చెందినవారు తరలిరానున్నారు. ఈ బిగ్ఈవెంట్ను కవర్ చేసేందుకు మరో 3వేల మందికి పైగా దేశ, విదేశీ మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు.
మే 6 నుంచే కంటెస్టెంట్స్ రాకతో హైద రాబాద్ సందడిగా మారనుంది. 10న గచ్చిబౌలిలో మిస్ వర్డల్ ఓపెనింగ్ సెర్మనీ, 31న మిస్ వరల్డ్ గ్రాండ్ఫినాలె జరగనుంది. మధ్యలో తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసేలా వివిధ ప్రాంతాల్లో రకరకాల ఈవెంట్లు నిర్వహించనున్నారు. తెలంగాణ వైపు ప్రపంచం దృష్టిని ఆకర్షించడం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం, ఇక్కడి పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్నది.
రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి దోహదం: జూపల్లి
మిస్‌వరల్డ్ పోటీలతో తెలంగాణ పేరు ప్రపంచమంతా మారుమోగుతుందని, వెస్ట్రన్కల్చర్కు భిన్నంగా భారతీయ, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల మేళ వింపుగా ఈ ఈవెంట్స్ నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్‌ను బలోపేతం చేయడంలో భాగంగా ‘తెలంగాణ.. జరూర్ ఆనా’ అనే ట్యాగ్ లైన్‌తో ప్రపంచస్థాయి పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని బేగంపేట్ టూరిజం ప్లాజాలో మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ బ్రాండ్ఇమేజ్ పెంచేందుకు నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలపై రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ‘‘72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో నిర్వహించేందుకు ముఖ్య కారణం ఉంది. తెలంగాణ పేరుతో ఒక రాష్ట్రం ఉందనే సంగతి ప్రపంచంలో చాలా మందికి తెలియదు. ఇటీవల విదేశాలకు వెళ్లినప్పుడు నాకు ఈ అనుభవం ఎదురైంది. అందుకే ప్రపంచ దేశాలను తెలంగాణకు రప్పించేందుకు, ప్రపంచం నోళ్లలో తెలంగాణ పేరు మారుమోగేలా చేసేందుకు మిస్ వరల్డ్ పోటీల రూపంలో వచ్చిన అవకాశాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటున్నది” అని వెల్లడించారు.
రాష్ట్ర ఆదాయం పెంచేందుకూ ఈ ఈవెంట్ దోహదపడుతుందన్నారు. ‘‘మిస్‌వరల్డ్ పోటీలకు మొత్తం రూ.54 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో సగం అంటే రూ.27 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా సగం ఈవెంట్ నిర్వాహకులు వెచ్చిస్తారు. ప్రభుత్వం ఇచ్చే రూ.27 కోట్లలో కేవలం రూ.5 కోట్లను మాత్రమే నేరుగా భరిస్తుంది. మిగిలిన రూ.22 కోట్లను స్పాన్సర్ల ద్వారా సమకూర్చుకునేలా ప్లాన్ చేస్తున్నం” అని తెలిపారు. వీటిని కేవలం అందాల పోటీలుగా మాత్రమే చూడవద్దని, ఈ పోటీలతో తెలంగాణ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కాగా, ఈ సందర్భంగా పర్యాటక శాఖ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.
తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్వహిస్తం: స్మితా సబర్వాల్
తెలంగాణకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. ఇక్కడ యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప, వేయి స్తంభాల గుడి, గోల్కొండ, కాకతీయ కోటలు, చార్మినార్ లాంటి ప్రముఖ కట్టడాలు ఉన్నాయని చెప్పారు. ఇలాంటి చారిత్రక, వారసత్వ సంపదకు నెలవైన తెలంగాణ 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమివ్వడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఈ పోటీలను నిర్వహిస్తామన్నారు.
మెడికల్ టూరిజంలోనూ తెలంగాణకు ఎంతో ప్రాధాన్యం ఉందని.. సినిమా, ఆహార రంగాల్లో తెలంగాణకు పెట్టింది పేరని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.
భారత్ గొప్పది: క్రిస్టినా పిజ్కోవా
భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ప్రతీక అని 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా అన్నారు. ‘నమస్తే ఇండియా’ అంటూ ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘భారతదేశం ఇన్‌స్పైరింగ్ కంట్రీ. ప్రపం చానికి విలువలను బోధిస్తున్నది. భారత్‌లో నాకు సాదర స్వాగతం లభించింది. నా ప్రయాణంలో, నా హృదయంలో భారత్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఈ దేశ సంస్కృతి, కళలు ఎంతో గొప్పగా ఉన్నాయి. ఎన్నో భాషలు ఉన్నా అందరూ ఒక్కటిగా కలిసి ఉండడం భారతదేశ స్ఫూర్తికి నిదర్శనం. మిస్ వరల్డ్ పోటీలు కూడా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించ డం మంచి అనుభూతిని ఇచ్చింది. ఈ జర్నీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని అన్నారు.