
హైదరాబాద్, వెలుగు: యాదగిరి గుట్టను సందర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా అన్నారు. తెలంగాణలో జరగనున్న మిస్ వరల్డ్ 2025 ప్రీ- ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో భాగంగా మంగళవారం ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా క్రిస్టినా యాదగిరి గుట్ట ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. యాదగిరి గుట్ట ఆలయానికి గొప్ప చరిత్ర ఉందని, సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు.
మిస్ వర్డల్ కాంపిటిషన్ లో పాల్గొనే 120 మంది ఆలయాన్ని సందర్శించి మంచి అనుభూతిని పొందనున్నారని చెప్పారు. క్రిస్టినా చౌమహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా ప్యాలెస్‌లను సందర్శించనున్నారు. గురువారం మధ్యాహ్నం 12:00 గంటలకు హోటల్ టూరిజం ప్లాజాలో మిస్ వరల్డ్ –2025 ప్రీ-లాంచ్ కార్యక్రమానికి హాజరు కానున్నారు.