బుద్ధ వనం ఏర్పాట్లపై రివ్యూ

బుద్ధ వనం ఏర్పాట్లపై రివ్యూ

హాలియా, వెలుగు: మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్​లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయని, 140 దేశాలకు చెందిన అందగత్తెలు వస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక సంస్థ ఎండీ న్యాలకొండ ప్రకాశ్​రెడ్డి తెలిపారు. వారు నాగార్జునసాగర్​ వద్ద ఉన్న బుద్ధవనాన్ని మే 12న బుద్ధ పూర్ణిమ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. శనివారం బుద్ధ వనంలో ఏర్పాట్లపై కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అందగత్తెలు ఇక్కడికి వస్తే బుద్ధవనంతోపాటు, విజయ విహార్, నాగార్జునసాగర్ డ్యాంను చూపిండంతో పాటు వీటి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అందరూ కాకున్నా ఆసియా ఖండానికి చెందిన 30 మంది రానున్నారని చెప్పారు. కళాకారులతో స్వాగత కార్యక్రమం, డ్రోన్ షో వంటివి ఏర్పాటు చేయాలని, బుద్ధ వనంలో మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. 

కలెక్టర్ మాట్లాడుతూ..  మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని, ఇక్కడికి వచ్చే వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. తాము పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని, ఆరోజు బుద్ధ వనానికి వచ్చే వారికి పాసులు జారీ చేస్తామని పేర్కొన్నారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, దేవరకొండ ఏఎస్పీ మౌనిక,  మిర్యాలగూడ డీఎస్సీ రాజశేఖర్​రాజు, హాలియా సీఐ జనార్ధన్​గౌడ్, బుద్ధ వనం ఓఎస్డీ సుబాన్ రెడ్డి, పురావస్తు శాఖ కన్సల్టెంట్ శివ నాగిరెడ్డి, పర్యాటకశాఖ జనరల్ మేనేజర్లు సూర్యప్రకాశ్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.