- మరో ఇద్దరికి గాయాలు
- హెజ్బుల్లా టెర్రరిస్టులు దాడిచేసి ఉండవచ్చు: ఐడీఎఫ్
జెరూసలెం/న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ ఉత్తర భూభాగంలో జరిగిన మిసైల్ దాడిలో కేరళ వాసి ఒకరు చనిపోయారు. మరో ఇద్దరు కేరళీయులు గాయపడ్డారు. ఇజ్రాయెల్‌లో మార్గాలియోట్ లోని ఓ తోటలో ఆ ముగ్గురు పనిచేస్తుండగా లెబనాన్ నుంచి సోమవారం ఉదయం 11 గంటలకు మిసైల్ దాడి జరిగింది. ఈ అటాక్ లో చనిపోయిన వ్యక్తిని పట్నిబిన్ మ్యాక్స్ వెల్ గా, గాయపడిన ఇద్దరిని బుష్ జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్ గా గుర్తించారు.
మిసైల్ అటాక్‌లో గాయపడిన వెంటనే ఆ ముగ్గురిని వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. జివ్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ మ్యాక్స్ వెల్ చనిపోయాడు. జార్జ్, మెల్విన్ చికిత్స పొందుతున్నారు. మ్యాక్స్ వెల్ సొంతూరు కొల్లం. జార్జ్, మెల్విన్ ది ఇడుక్కి జిల్లా. ‘జార్జ్‌కు బేలిన్సన్ ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తున్నాం. అతని శరీరం, ముఖంపై గాయాలయ్యాయి. డాక్టర్లు అతనికి ఆపరేషన్ చేశారు. బాధితుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. మెల్విన్ ను కూడా జివ్ ఆసుపత్రికి తరలించాం. దాడిలో అతనికి స్పల్ప గాయాలయ్యాయి’ అని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. లెబనాన్ నుంచి హెజ్బుల్లా టెర్రరిస్టులు ఈ దాడిచేసి ఉండవచ్చని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపాయి.
మృతుడి భార్య నిండు గర్భిణి
ఇజ్రాయెల్‌లో చనిపోయిన పట్నిబిన్ మ్యాక్స్ వెల్ ది కేరళలోని కొల్లం. అతనికి భార్య, ఐదేండ్ల కూతురు ఉన్నారు. భార్య ఏడు నెలల గర్భిణి. రెండు నెలల క్రితమే మ్యాక్స్ వెల్ ఇజ్రాయెల్ వెళ్లారు. అతనికి వీడ్కోలు పలికిన భార్య, కూతురికి అదే చివరి చూపు అవుతుందని వారు ఊహించలేదు. మృతుడి కుటుంబ సభ్యులతో ఇండియాకు ఇజ్రాయెల్ దౌత్యవేత్త నౌర్ గిలోన్ మాట్లాడారు. మృతుడి కుటుంబానికి అవసరమైన సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తమ కుమారుడి మరణ వార్త విని షాక్ అయ్యామని మ్యాక్స్ వెల్ తండ్రి పాథ్ రోస్ మ్యాక్స్ వెల్ తెలిపారు. తన నిండు గర్భిణి అయిన భార్యతో పాటు ఐదేండ్ల కూతురిని కూడా పట్నిబిన్ శాశ్వతంగా విడిచివెళ్లాడని ఆయన కన్నీంటి పర్యంతమయ్యారు. కాగా, నాలుగు రోజుల్లో పట్నిబిన్
మృతదేహాన్ని భారత్ కు తీసుకురానున్నారు.
భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
ఇజ్రాయెల్ లో మిసైల్ దాడిలో కేరళ వాసి చనిపోయిన నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న, నివసిస్తున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అడ్జ్వైజరీ విడుదల చేసింది. అందరూ జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని సూచించింది. ఇండియన్ల భద్రత కోసం ఎప్పటికపుడు ఇజ్రాయెల్ దౌత్యవేత్తలతో మాట్లాడుతున్నామని పేర్కొంది.